JNUలో దాడి చేసింది మావాళ్లే : హిందూ ర‌క్షా ద‌ళ్‌

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 07:09 AM IST
JNUలో దాడి చేసింది మావాళ్లే : హిందూ ర‌క్షా ద‌ళ్‌

Updated On : January 7, 2020 / 7:09 AM IST

జేఎన్‌యూలో ముసుగులు వేసుకుని వచ్చి దాడులు చేసింది మావాళ్లేనంటూ హిందూ ర‌క్షా ద‌ళ్‌కు చెందిన పింకీ చౌద‌రీ ప్రకటించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ..సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను తాము చూస్తు ఊరుబోమని హెచ్చరించటానికి ఈ దాడులు చేశామని తెలిపారు పింకీ చౌదరి. జేఎన్‌యూలో జ‌రిగిన దాడికి తాము పూర్తి బాధ్య‌త వ‌హిస్తామ‌ని చౌదరి స్పష్టం చేశారు. 

ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగులు వేసుకుని వచ్చి కనిపించిన విద్యార్ధుల్ని చావబాది..ప్రొఫెసర్లపై కూడా దాడి చేసిన నానా విధ్వంసం సృష్టించిన ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలన సృష్టించింది. ఈ ఘటనపై పలు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రముఖులు స్పందించారు. ఈ విధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. 

అయితే హిందూ ర‌క్షాద‌ళ్ చీఫ్ చేసిన కామెంట్ల‌పై ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఈ విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. జేఎన్‌యూలోకి మాస్క్‌లు వేసుకుని వ‌చ్చి క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీడియో ఫూటేజ్‌, ఫేస్ రికగ్నిష‌న్ టెక్నిక్‌తో వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ది.
ఆదివారం నాడు జరిగిన ఈ విధ్యంసంలో 30మందికి పైగా విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ముసుగు వ్యక్తుల చేతిలో పడకూడదనే భయంతో కొంతమంది విద్యార్ధులు భవనాలపైనుంచి దూకేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్దులకు కాళ్లు విరిగిపోయాయి. భయాందోళనలకు గురైన ఎంతోమంది విద్యార్ధులు క్యాంపస్ విడిచి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. 
క్యాంపస్ లో జరిగిన ఈ దాడులు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినవారే చేశారని పలువురు కేంద్రమంత్రులు ఆరోపించారు. దేశంలోని యూనివర్శిటీల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలువారు అరాచకాలు సృస్టిస్తున్నారని ఆరోపించారు. జేఎన్ యూలో ఈ దాడులు ఏబీవీపీ వారే చేశారని కొంతమంది విద్యార్ధులు ఆరోపించారు. ఇలా ఎవరికి వారు ఆరోపణలు సంధించుకున్నారు. ఈ క్రమంలో హిందూ రక్షాదళ్ దళం నేత  పింకీ చౌదరి ప్రకటనతో దాడులకు పాల్పడింది ఎవరో తేలింది. 

జెఎన్‌యూలో జరిగిన ఈ దాడిలో 30మందకి పైగా విద్యార్ధులు, ప్రొఫెసర్లతో పాటు జేఎన్ యూ  స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) అధ్యక్షుడు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.