Bird Flu
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లోని ఇరు ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందని అధికారులు ఇప్పటికే ప్రకటన చేశారు. అంతేగాక, ఆయా పౌల్ట్రీల నుంచి ఒక కిలోమీటర్ లోపు కోళ్లు, కోడిగుడ్లను కాల్చి వేయాలని కూడా పలు చోట్ల ఆదేశాలు ఇచ్చారు.
కొన్ని ప్రాంతాల్లో చికెన్ షాపులు మూసివేయాలని అధికారులు నోటీసులు ఇస్తుండడంతో మాంస ప్రియులకు చికెన్ లభ్యం కావడం లేదు. పలు ప్రాంతాల్లో మృతి చెందిన కోళ్ల నమూనాలను ఇప్పటికే భోపాల్‌లోని ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకు పంపారు. కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిని కూడా అధికారులు గమనిస్తున్నారు. కోళ్లకు వచ్చే వ్యాధులపై ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన ఉండడం మంచిది.
ఏమిటీ బర్డ్ ఫ్లూ?
ఏమిటీ బర్డ్ ఫ్లూ? అన్న సందేహాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయి. బర్డ్ ఫ్లూ అంటే అవియన్ ఇన్ఫ్లుఎంజా అనే వైరల్ సంక్రమణ. ఇది ముఖ్యంగా పక్షుల్లో వ్యాపిస్తుంది. పలు కొన్ని సందర్భాల్లో మనుషులకు కూడా సంక్రమించవచ్చు.
ఈ వ్యాధి ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్ వల్ల కలుగుతుంది. ఇందులోనూ అనేక రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. ప్రధానంగా హెచ్5ఎన్1, హెచ్7ఎన్9, హెచ్5ఎన్8 చాలా ప్రమాదకరమైనవి.
బర్డ్ ఫ్లూ ఓ అంటువ్యాధి. ప్రధానంగా పెంపుడు కోళ్లతో పాటు అడవి పక్షులకు సోకుతుంది. 100 ఏళ్లుగా ఈ వ్యాధి ఉంది. తొలుత యూరప్, ఆసియాల్లోని బాతుల్లో బర్డ్ ఫ్లూను కనుగొన్నారు. అనంతరం ఇతర పక్షులకు కూడా వ్యాపించినట్లు నిర్ధారించారు.
హెచ్5ఎన్1 వైరస్‌ను మొదటి 1996లో చైనాలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతూ వెళ్లింది. కొన్ని రోజుల వ్యవధిలోనే పక్షులు, కోళ్లకు వేగంగా వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
బర్డ్ ఫ్లూ ప్రాణాంతకమైనదే.. ఇది సోకిన పక్షుల్లో ఆకలి ఉండదు. గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా పక్షులు మృత్యువాత పడతాయి.
బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల్లో అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు ఉంటాయి. అలాగే, కండరాల నొప్పి, అలసట,
తీవ్రమైన స్థితిలో న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇలా?
బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల లాలాజలం, మలము ద్వారా, కోళ్లఫాం, పక్షుల మార్కెట్‌ల ద్వారా సోకుతుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టాకే తినాలి. కోళ్ల ఫాం లేదా పక్షుల సమీపంలో ఉండే వ్యక్తులు మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించాలి. పక్షుల మృతదేహాలను హ్యాండిల్ చేయొద్దు. పరిశుభ్రత పాటించాలి. బర్డ్ ఫ్లూ సోకిన వారు యాంటీవైరల్ మందులు వాడాలి.