Rs 2000 Bank Note Representative Image (Image Credit To Original Source)
Rs 2000 Note: నూతన సంవత్సరం వచ్చేసింది. దాంతోనే పలు మార్పులు వచ్చాయి. జనవరి 1 నుంచి అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి వచ్చేశాయి. ఈ క్రమంలో 2వేల రూపాయల కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన సమాచారం ఇచ్చింది. ఈ పెద్ద కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి మూడేళ్లు గడిచాయి. అయితే, తాజా అధికారిక లెక్కల ప్రకారం ఈ పెద్ద నోట్లలో ఇంకా కొంత శాతం ఇప్పటికీ చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది.
2వేల రూపాయల నోట్ల స్థితికి సంబంధించి ఆర్బీఐ బులెటిన్ విడుదల చేసింది. ”రూ. 2000 నోట్ల ఉపసంహరణను ప్రకటించిన మే 19, 2023న కార్యకలాపాల ముగింపు సమయానికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. డిసెంబర్ 31, 2025న కార్యకలాపాల ముగింపు సమయానికి అది రూ. 5,669 కోట్లకు తగ్గింది” అని జనవరి 1న విడుదల చేసిన అప్‌డేట్‌లో కేంద్ర బ్యాంక్ తెలిపింది.
దీనర్థం మే 19, 2023 నాటికి చలామణిలో ఉన్న ఈ అధిక విలువ కలిగిన నోట్లలో 98 శాతానికి పైగా కేంద్ర బ్యాంకుకి తిరిగొచ్చాయి. అయితే, చాలా తక్కువ సంఖ్యలో నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి లేదా వ్యక్తుల దగ్గర ఉన్నాయి.
ఈ క్రమంలో తలెత్తుతున్న పెద్ద సందేహం ఏంటంటే.. ఇప్పుడు రూ.2000 నోట్లు కలిగుండటం నేరమా? చట్టవిరుద్ధమా? వాటికి చట్టబద్ధత లేదా? దీనికి.. సమాధానం కాదు అని ఆర్బీఐ చెప్పింది. ఎందుకంటే ఉపసంహరణ ఆదేశం ఉన్నప్పటికీ 2వేల రూపాయల నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన చెలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తి దగ్గర ఇంకా 2వేల రూపాయల నోటు ఉన్నట్లయితే అది నేరం కాదు. అయితే, ఆ నోటును సెంట్రల్ బ్యాంకుకి తిరిగి ఇచ్చేయాల్సిందే.
RBI Representative Image (Image Credit To Original Source)
స్టెప్ 1: ముందుగా బ్యాంక్ బ్రాంచ్ లో డిపాజిట్ లేదా మార్చుకునే సౌకర్యం ఉందో లేదో తెలుసుకోండి..
భారత దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలలో 2వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఇచ్చిన అవకాశం అక్టోబర్ 7, 2023న ముగిసింది.
స్టెప్ 2: డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలను ఉపయోగించండి.
2023 అక్టోబర్ 9వ తేదీ నుండి వ్యక్తులు, సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లోకి 2వేల రూపాయల నోట్లను ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనిలోనైనా డిపాజిట్ చేయచ్చు.
స్టెప్ 3: ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలలో నేరుగా నోట్లను మార్చుకోండి.
2వేల రూపాయల నోట్లను ఇంకా కలిగి ఉన్న ఎవరికైనా ఆర్బీఐ తన 19 ఇష్యూ కార్యాలయాలలో డైరెక్ట్ ఎక్స్ చేంజ్ ఫెసిలిటీ కూడా అందిస్తోంది.
స్టెప్ 4: ఖాతాలో జమ చేయడానికి ఇండియా పోస్ట్ ద్వారా నోట్లను పంపండి.
ప్రజలు భారత దేశంలోని ఏ పోస్టాఫీస్ నుంచైనా ఇండియా పోస్ట్ ద్వారా 2వేల రూపాయల నోట్లను తమ బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్‌కు పంపొచ్చు.
స్టెప్ 5: ఆర్బీఐ జారీ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి.
RBI ఇష్యూ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి.
Also Read: యెమెన్‌లో సౌదీ, యూఏఈ మధ్య ఘర్షణలకు కారణాలేంటి? ఈ 2 పవర్‌ఫుల్ ఇస్లామిక్ దేశాల మధ్య ఏం జరుగుతోంది?