సౌదీ, UAE ఎందుకు కొట్టుకుంటున్నాయి? రెండు పవర్ ఫుల్ ఇస్లామిక్ దేశాల మధ్య గొడవ ఏంటి?

యెమెన్‌లో శుక్రవారం జరిగిన సౌదీ వైమానిక దాడుల్లో దాదాపు 20 మంది వేర్పాటువాదులు మరణించారు. ఎస్టీసీ లక్ష్యం ఏంటి?

సౌదీ, UAE ఎందుకు కొట్టుకుంటున్నాయి? రెండు పవర్ ఫుల్ ఇస్లామిక్ దేశాల మధ్య గొడవ ఏంటి?

Saudi Arabia and UAE Conflict (Image Credit To Original Source)

Updated On : January 3, 2026 / 5:18 PM IST
  • దక్షిణ యెమెన్ ప్రాంతాలను ఆక్రమించేందుకు ఎస్టీసీ యత్నం 
  • ఎస్టీసీ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా
  • ఎస్టీసీ వేర్పాటువాదులకు యూఏఈ మద్దతు

Saudi Arabia and UAE: యుద్ధం వల్ల దెబ్బతిని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న యెమెన్‌లో కొన్నేళ్ల క్రితం ఇరాన్ మద్దతున్న హౌతీలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాయి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఇప్పుడు మాత్రం సౌదీ అరేబియా, యూఏఈ అదే యెమెన్‌ వేదికగా ఘర్షణలకు దిగుతున్నాయి.

కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా ఈ రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. యెమెన్‌లో వేర్పాటువాదులకు, ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో ఆ ఇరు దేశాల మధ్య వివాదం నెలకొంది.

సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ (ఎస్టీసీ) వేర్పాటువాదులకు యూఈఏ మద్దతు ఉంది. యెమెన్‌లోని నేషనల్‌ షీల్డ్‌ ఫోర్సెస్‌ దళాలకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది.

Also Read: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు.. యూఎస్‌ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన దక్షిణ యెమెన్ ప్రాంతాల భూభాగాలను డిసెంబరులో ఎస్టీసీ ఆక్రమించడంతో సౌదీ అరేబియా తీవ్ర అసంతృప్తితో ఉంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సౌదీ అరేబియా.. ఎస్టీసీ చర్యను ముప్పుగా భావించింది.

ఎస్టీసీ వేర్పాటువాదులు డిసెంబరులో యెమెన్‌ ప్రభుత్వ అధీనంలోని హద్రమౌత్‌తో పాటు మహర్రా ప్రాంతాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ షీల్డ్‌ ఫోర్సెస్‌ దళాలు వెనక్కి తగ్గాయి. దీంతో ఇప్పటికే సౌదీ ఆగ్రహంతో ఉండగా.. అదే సమయంలో ఎస్టీసీకి యూఏఈ ఆయుధాలు పంపే ప్రయత్నాలు చేసింది.

యెమెన్ పోర్టు నగరం ముకల్లాలో దాడులు జరిగాయి. ఓ నౌకలో ముకల్లా ఓడరేవుకు ఆయుధాలు రావడంతో సౌదీ అరేబియా ఇటీవల ముకల్లాపై దాడులు చేసింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి.

నిన్న ఎస్టీసీ వేర్పాటువాదులపై సౌదీ అరేబియా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. వేర్పాటువాదులను దక్షిణ యెమెన్‌లోని స్థావరాల నుంచి ఖాళీ చేయించడమే సౌదీ అరేబియా లక్ష్యం. అందుకే ఇటీవల సౌదీ అరేబియా సైనిక చర్యను ప్రారంభించింది.

ఇందులో భాగంగా యెమెన్‌లో శుక్రవారం జరిగిన సౌదీ వైమానిక దాడుల్లో దాదాపు 20 మంది వేర్పాటువాదులు మరణించారు. యెమెన్‌లోని ముకల్లా నగరంపై జరిగిన బాంబుదాడుల అనంతరం సౌదీ అరేబియాలో నుంచి తమ బలగాలను వెనక్కు పిలుస్తామని ఈయూఏ ప్రకటించిన రెండు రోజులకే ఈ దాడులు చోటుచేసుకున్నాయి.

ఎస్టీసీ లక్ష్యం ఏంటి?
స్వతంత్ర దక్షిణ యెమెన్ దేశాన్ని ఏర్పాటు చేయడమే ఎస్టీసీ లక్ష్యం. 1990కు ముందు ఉన్న దక్షిణ యెమెన్‌ను తిరిగి స్థాపించాలన్న ఉద్దేశంతో ఎస్టీసీ ఏర్పడింది. ఈ కారణంగా దక్షిణ యెమెన్ ప్రాంతాలపై రాజకీయ, సైనిక ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు జరుపుతోంది.

పలు ప్రాంతలను కంట్రోల్‌ చేసి వ్యూహాత్మకంగా బలం పెంచుకోవాలనుకుంటోంది. వీరికే యూఈఏ మద్దతు ఇస్తుండడంతో సౌదీ రగిలిపోతోంది. తాత్కాలికంగా శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ విభేదాలు పూర్తి స్థాయిలో ఇప్పట్లో చల్లారే అవకాశం లేదు.