వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు.. యూఎస్‌ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు.

వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు.. యూఎస్‌ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు

Caracas Strikes, Trump (Image Credit To Original Source)

Updated On : January 3, 2026 / 3:49 PM IST
  • యూఎస్‌ అదుపులో వెనెజువెలా అధ్యక్షుడి భార్య కూడా 
  • వారిని వెనెజువెలా నుంచి తరలించిన అమెరికా
  • కొన్ని వారాలుగా అమెరికా దాడి చేస్తుందన్న ప్రచారం
  • ఇప్పుడు అదే పని చేసిన ట్రంప్

Caracas Strikes: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్‌ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు.

నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను వెనెజువెలా నుంచి తరలించినట్లు ట్రంప్ చెప్పారు. వెనెజువెలాపై అమెరికా దాడి చేస్తుందని, అందుకు తగ్గ వ్యూహాన్ని రచించుకుందని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే జరిగింది.

ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ దాడులకు సంబంధించిన వివరాలపై స్పష్టత ఇంకా రాలేదు. అమెరికా చేసిన దాడిలో వెనెజువెలా సైనిక మౌలిక సదుపాయాలకు ఎంత నష్టం జరిగింది? ఎంత ప్రాణనష్టం జరిగింది? అన్న వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Also Read: యెమెన్‌లో సౌదీ, యూఏఈ మధ్య ఘర్షణలకు కారణాలేంటి? ఈ 2 పవర్‌ఫుల్ ఇస్లామిక్‌ దేశాల మధ్య ఏం జరుగుతోంది?

వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో దీనిపై స్పందిస్తూ.. మృతులు, గాయపడినవారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. అమెరికా చేసిన దాడులు సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేసినట్లు చెప్పారు.

దాడిని వెనెజువెలా ప్రతిఘటిస్తుందని పాడ్రినో చెప్పడం గమనార్హం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌, ఆయన భార్యను అమెరికా సైన్యం డెల్టా ఫోర్స్ అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.

ఏయే ప్రాంతాల్లో దాడులు?
ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం.. అమెరికా దాడులు ప్రధానంగా రాజధాని కారకాస్ నగరంతో పాటు మిరాండా, అరాగువా, లా గువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది.

ఇంతకు ముందు ఏం జరిగింది? 
సెప్టెంబర్ ప్రారంభం నుంచి అమెరికా సైన్యం కరీబియన్ సముద్రం తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో షిప్‌లపై దాడులు చేస్తోంది. శుక్రవారం నాటికి నమోదైన ఇలాంటి దాడుల సంఖ్య 35. మరణించినవారి సంఖ్య దాదాపు 115. ఈ గణాంకాలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.

దక్షిణ అమెరికా తీర జలాల్లో అమెరికా దళాలను భారీగా పంపిన తర్వాత ఈ దాడులు జరిగాయి. నవంబర్ నెలలో దేశానికి చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక అక్కడికి చేరుకుంది.