×
Ad

Baahubali Rocket: ఇవి మామూలు విజయాలు కాదు.. ఎల్వీఎం-3 అంటే ఏంటి? ఇకపై మన దేశం..

ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్‌ వెహికిల్ మార్క్-3 (ఎల్వీఎం-3) రాకెట్ ద్వారా గతంలోనూ మొత్తం ఎనిమిది ప్రయోగాలు జరిపారు. అవన్నీ విజయవంతమయ్యాయి.

LVM3

Baahubali Rocket: భారత ‘బాహుబలి’ రాకెట్.. లాంచ్‌ వెహికిల్ మార్క్-3 (LVM3) హెవీ లిఫ్ట్ సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించింది. అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 (దీని బరువు సుమారు 6,100 కిలోలు) ఉపగ్రహాన్ని బుధవారం ఉదయం.. లో ఎర్త్ ఆర్బిట్‌లో ఇస్రో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు భారతదేశం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే.

లో ఎర్త్ ఆర్బిట్‌ అంటే భూమికి సుమారు 200 కి.మీ-2,000 కి.మీ మధ్య ఎత్తులో ఉండే ఉపగ్రహ కక్ష్య. ఎల్వీఎం 3 రాకెట్‌ 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఇస్రో తెలిపింది. నేడు జరిపిన ప్రయోగం ఎల్వీఎం3-ఎం6/బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్‌తో కలిపి భారత్‌ ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

Also Read: శివాజీ రైట్ టైమ్‌లో రైట్‌గా చెప్పారు.. ఎందుకంటే?: అనసూయ, చిన్మయికి కరాటే కల్యాణి కౌంటర్

ఇప్పటివరకు ప్రయోగించిన ఎల్వీఎం-3 మిషన్లు ఇవే..
ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్‌ వెహికిల్ మార్క్-3 (ఎల్వీఎం-3) రాకెట్ ద్వారా గతంలో మొత్తం ఎనిమిది ప్రయోగాలు జరిపారు. అవన్నీ విజయవంతమయ్యాయి. వాటిలో చంద్రయాన్-2, చంద్రయాన్-3, రెండు వన్‌వెబ్ మిషన్లు (72 ఉపగ్రహాలు) కూడా ఉన్నాయి.

నేడు చేసిన ప్రయోగాన్ని మినహాయిస్తే ఎల్వీఎం-3 ద్వారా చివరిసారిగా ఎల్వీఎం3-ఎం5/సీఎంఎస్-03 మిషన్‌ను నవంబర్ 2న విజయవంతంగా పూర్తి చేశారు. “52 రోజుల్లో ఎల్వీఎం3 వరుసగా రెండు మిషన్లు పూర్తి చేయడం ఇదే మొదటిసారి” అని ఇస్రో చీఫ్ అన్నారు.

ఎల్వీఎం-3 ప్రత్యేకత
ఎల్వీఎం-3 మూడు దశల లాంచ్‌ వెహికిల్ (ప్రయోగ వాహనం). ఇందులో రెండు ఘన ఇంధన స్ట్రాప్-ఆన్ మోటార్లు ఎస్200, ద్రవ కోర్ దశ ఎల్110.. క్రయోజెనిక్ పై దశ సీ25 ఉన్నాయి. మొత్తం బరువు 640 టన్నులు. ఎత్తు 43.5 మీటర్లు. జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌కు 4,200 కిలోగ్రాముల పేలోడ్ మోయగల సామర్థ్యం ఉంది.

ఎస్200 ఘన మోటార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఘన బూస్టర్లలో ఒకటి. ఇందులో 204 టన్నుల ఘన ఇంధనం ఉంటుందని ఇస్రో తెలిపింది. ఎల్110 దశలో జంట ద్రవ ఇంజిన్ అమరిక ఉంది. ఇందులో 115 టన్నుల ద్రవ ఇంధనం ఉంటుంది. సీ25 క్రయోజెనిక్ పై దశ పూర్తిగా స్వదేశీ అధిక శక్తి క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ20తో అమర్చారు.

ఇందులో 28 టన్నుల ఇంధన లోడ్ ఉంటుంది. క్రయోజెనిక్ ఇంజిన్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రతల ద్రవ ఇంధనాలతో పనిచేసే అధిక సామర్థ్య రాకెట్ ఇంజిన్. ఇకపై మనదేశం మరిన్ని భారీ ప్రయోగాలు చేపట్టనుంది.