పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది ?

పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది ?

Updated On : February 17, 2021 / 11:26 AM IST

Kiran Bedi : పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది…? కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ అర్ధాంతర తొలగింపు వంటి పరిణామాలతో అక్కడ హై డ్రామా నెలకొంది. కిరణ్ బేడీ తొలగింపును స్వాగతిస్తూనే….బీజేపీపై నారాయణ స్వామి మండిపడ్డారు. బీజేపీ అమలు చేస్తున్న ఆపరేషన్ లోటస్ పాండిచ్చేరి చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ప్రలోభ పెట్టి, బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు గురించి పాండిచ్చేరి మొత్తం మాట్లాడుకుంటోందన్నారు నారాయణ స్వామి. మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ రాజీనామాలు ఇంకా అంగీకరించలేదని తెలిపారు. కిరణ్‌ బేడీ తొలగింపు పాండిచ్చేరి ప్రజల విజయమన్నారు. ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేయలేదని, బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరించారని ముఖ్యమంత్రి విమర్శించారు. పుదుచ్చేరిలో కిరణ్ బేడీ సమాంతర ప్రభుత్వం నడిపారని మండిపడ్డారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్‌గా తొలగింపు తర్వాత కిరణ్ బేడీ తొలిసారి స్పందించారు. పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేయడం జీవితకాలం అనుభవమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ అవకాశమిచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడుతో పాటు పుదుచ్చేరికి మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. పాండిచ్చేరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఆయన పర్యటన కూడా ఖరారయింది. కానీ అంతలోనే పాండిచ్చేరిలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత నెల 25న మంత్రి ఎ. నమశ్శివాయన్, ఇ. తిప్పైంజన్ రాజీనామాలతో మొదలైన సంక్షోభం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని తొలగించాలని కోరుతూ ఫిబ్రవరి 10న రాష్ట్రపతిని కలిశారు ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఆ సమయంలో ఆయన వెన్నంటి ఉన్న మల్లాడి కృష్ణారావు ఈ నెల 15న రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మల్లాడి రాజీనామాపై చర్చ జరుగుతుండగానే

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ వారు రాజీనామా చేశారు. వారిలో నారాయణస్వామి అనుంగు అనుచరుడు జాన్ కుమార్ ఉండడం అందరినీ నివ్వెర పరిచింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రభుత్వ మనుగడపై సందేహాలు నెలకొన్నాయి. నామినేటెడ్ సభ్యులతో కలిపి పుదుచ్చేరి అసెంబ్లీలో 33 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లు గెలిచింది. డీఎంకె మూడు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, డీఎంకె కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ బలం పదిలోపుకు పడిపోయింది. స్పీకర్‌తో కలిపితే ఆ పార్టీకి పదిమంది సభ్యులున్నారు. మొత్తంగా అధికార కూటమిలో 14 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష బీజేపీ-అన్నాడీఎంకె కూటమిలోనూ ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు కాగా, AINRC పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఉన్నారు. బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

పుదుచ్చేరిలో ఇప్పుడు బీజేపీ అనుసరించే వ్యూహంపై అందరి దృష్టి నెలకొంది. అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి ఇంకా మూడు నెలల గడువే ఉంది. ఈ పరిస్థితుల్లో గోవా, మధ్యప్రదేశ్ తరహాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నించకపోవచ్చు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని తొలగించడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో భాగంగానే కిరణ్‌ బేడీని తొలగించారన్న ప్రచారమూ జరుగుతోంది. పుదుచ్చేరిలో పని తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ బేడీనే గవర్నర్‌గా కొనసాగిస్తే..ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని, అందుకే ఆమెను తొలగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.