కొండేపి కింగ్‌ ఎవరు..? వైసీపీలో వర్గపోరు, టీడీపీలో అంతర్గతపోరు

ప్రకాశం : పేరుకు అది ఎస్సీ నియోజకవర్గమే. కానీ పెత్తనం అంతా పెద్దోళ్లదే. మూడు కుటుంబాలు, నలుగురు నేతల మధ్యే ఇక్కడ రాజకీయాలు రంగులరాట్నంలా తిరుగుతుంటాయి.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 03:06 PM IST
కొండేపి కింగ్‌ ఎవరు..? వైసీపీలో వర్గపోరు, టీడీపీలో అంతర్గతపోరు

Updated On : January 30, 2019 / 3:06 PM IST

ప్రకాశం : పేరుకు అది ఎస్సీ నియోజకవర్గమే. కానీ పెత్తనం అంతా పెద్దోళ్లదే. మూడు కుటుంబాలు, నలుగురు నేతల మధ్యే ఇక్కడ రాజకీయాలు రంగులరాట్నంలా తిరుగుతుంటాయి.

ప్రకాశం : పేరుకు అది ఎస్సీ నియోజకవర్గమే. కానీ పెత్తనం అంతా పెద్దోళ్లదే. మూడు కుటుంబాలు, నలుగురు నేతల మధ్యే ఇక్కడ రాజకీయాలు రంగులరాట్నంలా తిరుగుతుంటాయి. వీరి అండదండలున్న నేతలే విజయం సాధిస్తారనే టాక్‌ బలంగా ఉంది. అయితే ఈ సారి ప్రతిపక్షపార్టీలో తీవ్ర వర్గపోరు, అధికార పార్టీలో అంతర్గతపోరు.. ప్రకాశం జిల్లా కొండేపి రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో అగ్రనాయకత్వం కొండేపి రాజకీయాన్ని ఎలా శాసించబోతోంది.. ప్రజాతీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

 

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో.. కొండేపి, టంగుటూరు, జరగుమల్లి, సింగరాయకొండ, పొన్నలూరు, మర్రిపూడి మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2లక్షల 14వేలు. పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన ఈ నియోజకవర్గంలో.. కమ్మ సామాజికవర్గ ఓట్లే అధికం. రాజకీయపరంగా చూసుకుంటే పేరుకే ఇది ఎస్సీ నియోజకవర్గం. పెత్తనం మాత్రం అగ్రవర్ణాలదే. దశాబ్ధాల చరిత్ర చూస్తే దామచర్ల, పోతుల, బెల్లం కుటుంబాలకు చెందిన నేతల ఏలుబడే సాగింది. ఇక్కడ ఎవ్వరు గెలవాలన్నా, ఓడాలన్నా నిర్ణయించేది ఈ నలుగురే.

 

2009లో కొండేపి ఎస్సీ నియోజకవర్గంగా మారిన తరువాత కాంగ్రెస్ అభ్యర్ధి వెంకటేష్ తన సమీప టీడీపీ అభ్యర్ధి బాల వీరాంజనేయ స్వామిపై 5వేల ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బాలవీరాంజనేయ స్వామి వైసీపీ అభ్యర్ధి జూపూడి ప్రభాకర్‌పై 5వేల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాజకీయ సమీకరణామాలు మారడంతో జూపూడి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేశారు. దీంతో వైసీపీ సమన్వయకర్తగా వరికూటి అశోక్‌బాబును అధిష్టానం నియమించింది. నాలుగేళ్ల పాటు సమన్వకర్తగా ఉన్న అశోక్ బాబు స్థానికంగా ఉన్న వర్గపోరును నియంత్రిచలేక పోతున్నారనే సాకుతో అధిస్టానం ఆయనను ఇంచార్జీగా తొలగించి మాదాసి వెంకయ్యను నియమించింది. దీంతో ఆగ్రహానికి గురైన వరికూటి ఆమరణ నిరాహారదీక్షకు దిగడంతో వైసీపీలో వివాదం రాజుకుంది. అయితే విజయసాయిరెడ్డి, బాలినేని వంటి నేతలు అశోక్ బాబుకు దన్నుగా నిలవడంతో .. మాదాసి వెంకయ్య తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాను పార్టీలోకి వచ్చాను కాబట్టి .. తనకే సీట్ కన్ఫామ్‌ అని ధీమాగా ఉన్నారు. ఇలా అశోక్ బాబు, వెంకయ్యల మధ్య టికెట్ విషయంలో పోటీ నెలకొంది.

 

కొండేపిలో విపక్షం పోరు ఇలా ఉంటే అధికారపక్షం సైతం అంతర్గత కుమ్మలాటలతో సతమతమవుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే వీరాంజనేయస్వామికి దామచర్ల కుటుంబం మధ్య విభేదాలు తారస్ధాయికి చేరాయి. దీనిపై స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకున్నా విభేధాలు పరిష్కారం కాలేదు. మరోవైపు టీడీపీలో టికెట్ వ్యవహారంలోనూ ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జూపూడి సైతం కొండేపీ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

సమస్యలతో సతమతమవతున్న కొండేపిని అభివృద్ధి చేసే విషయంలో నేతలు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. 28 గ్రామాలకు తాగు, 10వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు తలపెట్టిన సంగమేశ్వర ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు. తనను గెలిపిస్తే సంగమేశ్వర కలను నిజం చేస్తానంటూ, ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన బాలవీరాంజనేయస్వామి అధికారంలోకి రాగానే తన హామీలు ఆటకెక్కించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నియమించిన కాంట్రాక్టర్లను తొలగించడంతో వారి స్థానంలో వేరే వారిని నియమించకపోవడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మూసి, పాలేరు వంటి వాగులపై చెక్ డ్యామ్‌లు నిర్మిస్తామన్న హామీలు సైతం ఆటకెక్కాయి. కొండేపి నియోజకవర్గం మీదుగా రామతీర్ధం జలాలు పారుతున్నా నియోజకవర్గ దాహార్తి మాత్రం తీరడం లేదు. దీంతో నేతల తీరుపై జనం ఆగ్రహంగా ఉన్నారు.

అధికార పార్టీలో అంతర్గత పోరు, ప్రతిపక్ష పార్టీలో వర్గపోరు అధినేతలను ఇబ్బంది పెడుతున్న సమస్యలు. మరి ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరికి టిక్కెట్ దక్కుతుందో.. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.