ఇకపై వారిని నడిరోడ్డుపై కాల్చి పారేస్తాం: మంత్రి సంచలన ప్రకటన

ఆ మంత్రి ఈ వార్నింగ్‌ ఎందుకు ఇచ్చారో తెలుసా?

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆవులు చోరీల కేసులు పెరిగిపోతుండడంతో ఆ రాష్ట్ర మంత్రి మాన్కాలా వైద్యా స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఆవులను చోరీ చేసేవారిని రోడ్డుపై లేదంటే బహిరంగ ప్రదేశంలో కాల్చివేస్తామని హెచ్చరించారు.

ఉత్తర కన్నడ జిల్లాలో ఇటువంటి కార్యకలాపాలను కొనసాగించే వీలు లేకుండా చేస్తానని చెప్పారు. ఆవులను రక్షించడానికి తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

హోన్నవర్ సమీపంలో ఇటీవల గర్భంతో ఉన్న ఆవును కొందరు వధించిన ఘటనపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో మంత్రి మాన్కాలా దీనిపై స్పందిస్తూ స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారు.

China: అమెరికాపై ప్రతీకార చర్యకు దిగిన చైనా.. కెనడా, మెక్సికోలకు ట్రంప్ బిగ్ రిలీఫ్.. ఎందుకంటే?

ఆవుల చోరీలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయని మన్కాలా అన్నారు. ఈ స్మగ్లింగులకు ఇక చరమగీతం పాడేలా చేయాలని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని తాను ఎస్పీకి చెప్పినట్లు తెలిపారు.

మనం ఆవులను ఆరాధిస్తామని, ఈ జంతువులను ప్రేమతో, దయతో చూసుకుంటామని చెప్పారు. వాటి పాలు తాగే మనం పెరిగామని అన్నారు. కొన్ని ఘటనల్లో ఆవు స్మగ్లర్లను కొన్నిసార్లు అరెస్టు చేశామని, అయినప్పటికీ అలాంటివి కొనసాగితే.. నిందితులను రోడ్డు మీదే లేదా బహిరంగ ప్రదేశంలో కాల్చి చంపేస్తామని అన్నారు.

మంచి పని చేసుకుని, సంపాదించుకుని, తినాలని మన్కాలా చెప్పారు. తమ జిల్లాలో తగినన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏదేమైనా సరే స్మగ్లర్ల అంశాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.