మోడీ సారధ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలోని ప్రభుత్వం 8 నవంబర్, 2016న రూ. 1000, రూ.500 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
పెద్ద నోట్లు రద్దు చేసి నేటితో మూడేళ్లు పూర్తియైన సందర్భంగా సోనియా గాంధీ విలేకరులతోమాట్లాడుతూ.. అదోక తుగ్లక్ చర్యగా అభివర్ణించారు.పెద్ద నోట్ల రద్దు దేశంలోని సామాన్యులను, అమాయకులైన ప్రజలను బాధించిందన్నారు. కోటి ఉద్యోగాలను తుడిచిపెట్టడం, నిరుద్యోగిత రేటును 45 సంవత్సరాలు గరిష్ట స్ధాయికి తీసుకు వెళ్లడం, వంటివి చేసింది మినహా ఒరిగిందేమిలేదన్నారు. ప్రతిపక్ష నాయకులు, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు సైతం డీమానిటైజేషన్‌ను వ్యర్థమైన చర్యగా వర్ణించారని ఆమె అన్నారు.
మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలపై దాని ప్రభావం ఇంకా కొనసాగుతోందని సోనియా తీవ్రంగా విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ దిగజారుడుకి, పేదల అవస్థలకే ఇది పరిమితమైందని ఆమె అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మోకాళ్ల మీదకు తీసుకువచ్చిందన్నారు. బీజేపీ చెడు పాలనకు ఇదొక నిదర్శనమన్నారు.మోడీ ఆయన సహచరులు డీమోనిటైజేషన్ గురించి ఇప్పుడు మాట్లాడం మానేసినా ప్రజలు మాత్రం మర్చిపోరని, ఎన్నటికీ క్షమించరని సోనియా హెచ్చరించారు.