వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ : 6శాతానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు

  • Published By: venkaiahnaidu ,Published On : October 13, 2019 / 06:15 AM IST
వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ : 6శాతానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు

Updated On : October 13, 2019 / 6:15 AM IST

దేశంలో కొద్ది రోజులుగా ఆర్థిక మందగమనం నెలకొందంటూ వార్తలు వినిపిస్తున్న సమయంలో భారత వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. 2019-20ఆర్థికసంవత్సరం భారత వృద్ధి రేటు 6శాతంకి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం యొక్క జిడిపి వృద్ధి రేటు ఆరు సంవత్సరాల కనిష్టానికి 5% కి పడిపోయిన సమయంలో ప్రపంచ బ్యాంక్ అంచనాలు వచ్చాయి. అయితే ద్రవ్య విధానం సౌకర్యవంతంగా ఉంటే…దేశం క్రమంగా 2021 లో 6.9%, 2022 లో 7.2% కు కోలుకుంటుందని తెలిపింది.

వరల్డ్ బ్యాంక్… తన దక్షిణ ఆసియా ఎకనామిక్ ఫోకస్ లెటెస్ట్ ఎడిషన్ లో ఈ విధంగా తెలిపింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF)తో యాన్యువల్ మీటింగ్ కు ముందే వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన ఈ రిపోర్ట్ లో  భారత ఆర్థిక వృద్ధి వరుసగా రెండవ సంవత్సరం క్షీణించిందని తెలిపింది. 2018-19 ఆర్థికసంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8% వద్ద ఉండగా, 2017-18 లో ఇది 7.2% గా ఉన్న విషయం తెలిసిందే. 2019-20 మొదటి త్రైమాసికంలో… డిమాండ్ వైపు ప్రైవేట్ వినియోగంలో గణనీయమైన క్షీణత మరియు సరఫరా వైపు పరిశ్రమ, సేవల రెండింటిలో వృద్ధి బలహీనపడటంతో ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మరియు విస్తృత-ఆధారిత వృద్ధి క్షీణతను ఎదుర్కొందని రిజర్వ్ బ్యాంక్ తన రిపోర్ట్ లో తెలిపింది. కరెంట్ అకౌంట్ లోటు 2.1 శాతానికి పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.

అక్టోబర్ 4 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2019 -20 సంవత్సరానికి అంచనా వేసిన వృద్ధి రేటును 6.1 శాతానికి సవరించింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు తన వృద్ధి అంచనాను సెప్టెంబరులో 7% నుండి 6.5% కు తగ్గించింది.