Zomato Platform Fee Hike : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది జొమాటో, సిగ్వీ. ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రజలకు బాగా అలవాటయ్యాయి. పండుగల సమయంలో ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ జొమాటో, సిగ్వీలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాయి. అయితే, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల వేళ జొమాటో తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ప్రతి ఆర్డర్‌లపై వసూలుచేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10 నుంచి రూ.12కి పెంచింది. జొమాటో అందుబాటులో ఉన్న ప్రతి నగరంలోని కస్టమర్లకు ఈ పెంపు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.
Also Read: Special Trains : పండుగల వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
జొమాటో ఆగస్టు 2023లో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.2గా ప్రవేశపెట్టింది. మార్జిన్లను మెరుగుపర్చడం, లాభాలను పెంచడం లక్ష్యంగా ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అనేకసార్లు ప్లాట్ ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. గతేడాది పండుగల సీజన్‌కు ముందు జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.6 నుంచి ఏకంగా రూ.10కి పెంచింది. ప్రస్తుతం దానిని రూ.12కి పెంచింది. పండుగల సీజన్ లో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడంతో డెలివరీ బృందానికి ఎక్కువ చెల్లింపులు చేయాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. స్విగ్గీ కూడా ఇటీవల ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన విషయం తెలిసిందే. కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.12 నుంచి రూ.14కు పెంచింది. ప్రతిరోజూ లక్షల ఆర్డర్లను సప్లయ్ చేసే జొమాటో, స్విగ్గీలకు ఈ ప్లాట్‌ఫామ్‌ల ఫీజు పెంపు గణనీయమైన అదనపు ఆదాయాన్ని సమకూర్చనుంది.
ఇదిలా ఉంటే.. జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ కు ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 90శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.253 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఆ మొత్తం రూ.25కోట్లకు తగ్గింది. ఆదాయం 70శాతం పెరిగినప్పటికీ కంపెనీ నికర లాభం తగ్డం గమనార్హం.