ఎమర్జెన్సీలో ఆపద్బాంధవుల్లా ఆదుకుంటారు.. జొమాటో డెలివరీ బాయ్స్‌కి సీపీఆర్, ప్రథమ చికిత్సలో శిక్షణ.. రికార్డు బద్దలు

కంపెనీలో పనిచేసే 30,000 మందికి పైగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఈ శిక్షణ పొందారని జొమాటో..

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో తమ డెలివరీ బాయ్స్‌కి సీపీఆర్, ప్రథమ చికిత్స వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చాలా మంది రోడ్ల పక్కనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తున్నాం. బాధితుడి పడిపోయిన సమయంలో సీపీఆర్ చేస్తే అతడు బతికే అవకాశం ఉంటుంది.

ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ ఉద్యోగంలో భాగంగా బైకులపై తిరగాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి సీపీఆర్, ప్రథమ చికిత్స వంటివి నేర్పిస్తే వారు బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. జొమాటో ఇటీవలే తమ కంపెనీ డెలివరీ బాయ్స్ కి ఈ నైపుణ్యాలను నేర్పడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

అంతేగాక, ఒకే వేదికపై నిర్వహించిన ఈ అతిపెద్ద ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పింది. దీంతో ఆ ఫుడ్ డెలివరీ కంపెనీ చేసిన కార్యక్రమంపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Also Read: మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా: నారా లోకేశ్

దీనిపై జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఎక్స్ లో స్పందిస్తూ.. ముంబైలో తాము 4,300 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ తో ఒకే వేదిక వద్ద అతిపెద్ద ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టామని అన్నారు. కాగా, తమ కంపెనీలో పనిచేసే 30,000 మందికి పైగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఈ శిక్షణ పొందారని తెలిపారు. మెడికల్ కిట్లు కూడా డెలివరీ బాయ్స్ దగ్గర ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు