IND vs SL : శనివారం నుంచి తొలి టెస్టు.. టీమ్ఇండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్..
తొలి టెస్టు ప్రారంభానికి ముందు (IND vs SL) శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ టీమ్ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు.
Sri Lanka captain warns India ahead of Galle Test
IND vs SL : భారత్, శ్రీలంక జట్ల మధ్య శనివారం నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక టెస్టు కెప్టెన్ ధనంజయ డిసిల్వ కీలక వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా శ్రీలంకలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారి వర్షాలు కురుస్తుండడంతో పరిస్థితుల్లో కాస్త మార్పు ఉండొచ్చునని డిసిల్వ పేర్కొన్నాడు.
‘సాధారణంగా శ్రీలంకలో స్పిన్ పిచ్‌లు ఉంటాయి. కానీ ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. వాతావరణం పొడిగా ఉండదు. మా బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. అందువల్ల తొలి రెండు, మూడు రోజులు బ్యాటర్లకు సహకరించి, ఆ తర్వాత తిరగడం ప్రారంభించే పిచ్‌లు ఉంటాయని భావిస్తున్నాను. స్పిన్నర్లే మా బలం. అదే సమయంలో మ్యాచ్ గతిని మార్చగల నాణ్యమైన పేసర్లు కూడా మా జట్టులో ఉన్నారు.’ అని ధనుంజయ డిసిల్వ తెలిపాడు.
IND vs SL : భారత్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ఇదే.. ఏకంగా 16 మందికి చోటు..
స్పిన్‌కు అనుకూలమైన పిచ్ లపైనే భారత జట్టు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. అయినప్పటికి టీమ్ఇండియాను తేలికగా తీసుకోవడం లేదన్నాడు. భారత బ్యాటర్లకు స్పిన్‌ను ఎలా ఎదుర్కొనాలో బాగా తెలుసునని, వాళ్లు పుంజుకునేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారన్నాడు.
గణాంకాల పరంగా చూసుకుంటే తమ జట్టుదే పై చేయి అని చెప్పుకొచ్చాడు. ఇక ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో గాలె మైదానంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది ప్రభాత్ జయసూర్య అని తెలిపాడు. అతడి అనుభవం తమకు బాగా కలిసి వస్తుందన్నాడు. పర్యాటక జట్ల బ్యాటర్లపై గత కొన్నేళ్లుగా అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని చెప్పాడు.
బుమ్రా లేకపోవడం భారత్‌కు పెద్ద నష్టమేనని అన్నాడు. మిగిలిన బౌలర్లను ఎదుర్కొనేందుకు తమ బ్యాటర్లు పూర్తిగా సిద్ధం అయ్యారని అన్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్‌లు ఆడడం అంత తేలిక కాదన్నాడు. నాలుగో లేదా ఐదో రోజు వరకు మ్యాచ్‌ను తీసుకువెళ్లగలిగితే భారత్‌ను ఓడించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నాడు. తొలి మ్యాచ్‌లో ఓడించి వారిని ఒత్తిడిలోకి నెడతామన్నాడు.
ఇదిలా ఉంటే.. కెప్టెన్ గిల్‌తో పాటు భారత జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
