మరోసారి వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ : ఆ 2 జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలే టార్గెట్

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 11:33 AM IST
మరోసారి వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ : ఆ 2 జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలే టార్గెట్

Updated On : December 4, 2019 / 11:33 AM IST

ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు పార్టీ మార్చాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించింది. ఈ మేరకు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు.. టీడీపీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. 

ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నాలను అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో ఇద్దరికి అధికార పార్టీ నేతలు ఫోన్లు చేశారన్న వార్త రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది. దీనిపై ముగ్గురు మంత్రులు ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. 

ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలే టార్గెట్‌గా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందన్న వార్తలు… టీడీపీలో కలకలం రేపుతున్నాయి. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కొడాలి నాని, పేర్ని నాని తొలుత ఎమ్మెల్యే గొట్టిపాటితో మంతనాలు జరిపారని.. పార్టీ మారేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన క్వారీలపై అధికారుల దాడులు ప్రారంభమయ్యాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అనంతరం బాలినేని కూడా రంగంలోకి దిగి రవికుమార్‌తో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కొడాలి నాని… పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావుతో చర్చలు జరిపారని… అసెంబ్లీ సమావేశాల్లోపు వైసీపీలో చేరితే అన్ని విధాలా ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల పైనేకాదు.. గుంటూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపైనా ఇలాగే ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో అప్రమత్తమైన టీడీపీ అధినేత చంద్రబాబు.. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. వైసీపీ ట్రాప్‌లో పడవద్దని సూచించారు. దీనికి ఆ ఎమ్మెల్యేలు అనుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంత ఒత్తిడి చేసినా టీడీపీని వీడబోమని చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం