ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు అంటున్న రైతులు.. రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని కోరారు. తమ సమస్యలను చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన పురంధేశ్వరి.. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పురంధేశ్వరి అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులిచ్చినా.. నాటి టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించి కాలయాపన చేసిందని పురంధేశ్వరి మండిపడ్డారు.
రాజధాని రైతులకు వైసీపీ, టీడీపీ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు భూములను తిరిగి ఇచ్చేస్తామని మంత్రులు అనడం కరెక్ట్ కాదన్నారు. రాజధాని కోసం కేంద్రప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం కేవలం గ్రాఫిక్స్‌తో కలం గడిపేసిందని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తుందన్న పురంధేశ్వరి.. ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో రైతులు వారి భూములని ఇచ్చారని చెప్పారు.
ఒక పార్టీకో లేక ఒక నాయకుడికో వారు భూములు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒక మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది అనే నమ్మకంతో వారు భూములని ఇచ్చారని చెప్పారు. జగన్ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో చర్చ మొత్తం దానిపైకే మళ్లింది.