మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను, నన్ను ఆశీర్వదించండి- నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్

మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను. మీ పౌరుషానికి ఎక్కడా భంగం కలగనివ్వను. మీ పౌరుషాన్ని పెంచే వాడినే కానీ తుంచే వాడు కాదు ఈ అనిల్ కుమార్ యాదవ్.

Anil Kumar Yadav

Anil Kumar Yadav : రేపటి నుంచి నేను నరసరావుపేటలోనే ఉంటాను అందరినీ కలుస్తాను అని నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ ఇంఛార్జి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే అన్నలను అందరినీ కలుస్తానని, అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటకు వెళ్లారు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అనిల్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ఇక నుంచి నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని, తనను నరసరావుపేట ప్రజలు ఆశీర్వదించాలని అనిల్ కుమార్ యాదవ్ కోరారు.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

”పార్లమెంటే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాను కూడా నేను అడుగుతున్నా. అన్నా ఆలోచన చేయండి. గతం కన్నా ఈసారి అదనంగా ముగ్గురు బీసీలకు ఎంపీ టికెట్లు ఇచ్చారు జగన్. ఏలూరు(కారుమూరి సునీల్), నరసరావుపేట(అనిల్ కుమార్ యాదవ్), నర్సాపురం.. ఈ మూడు బీసీలకు ఇచ్చారు. ఈ మూడు గెలిపించుకుంటే మనకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలిస్తే నేను మంచి మెజార్టీతో గెలుస్తా. మీ అందరూ నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలి.

మిమ్మల్ని నమ్మి పల్నాడు గడ్డకు వచ్చాను. మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను. మీ పౌరుషానికి ఎక్కడా భంగం కలగనివ్వను. మీ పౌరుషాన్ని పెంచే వాడినే కానీ తుంచే వాడిని కాదు ఈ అనిల్ కుమార్ యాదవ్. మీరు ఎక్కడికి వెళ్లినా.. మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను. మొదట్లో కొంచెం బాధ వేసింది. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటాను అని బాధపడ్డా. అయితే ఈ ప్రాంతానికి వచ్చాక గర్వపడుతున్నా.

పైనున్న ఆ దేవుడిని, తాడేపల్లిలో ఉన్న ఈ దేవుడిని నమ్మా. ఇక్కడి దాకా వచ్చా. అన్న నన్ను ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు. భగవంతుడు ఆశీర్వదిస్తే మీ ఆశీస్సులతో ఇంకా పెద్ద పదవులకు వెళ్తాను. ఇక్కడున్న ఏడుగురు ఎమ్మెల్యేలు నాకు అన్న సమానులు. వారందరితో కలిసి మెలిసి ముందుకు సాగుతాను. మీ అందరూ మీ ఆశీస్సులతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా” అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Also Read : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అశోక్ గజపతిరాజు తీరు

నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనను గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారు. అందుకు నిరాకరించిన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. కాగా, నరసరావుపేట నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దీంతో సీఎం జగన్.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీగా బరిలోకి దింపితే గెలవొచ్చని భావించారు. ఇందులో భాగంగా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు