Ashok Gajapathi Raju: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అశోక్ గజపతిరాజు తీరు

ఈసారి ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజు మార్క్‌ తప్పకుండా కనిపిస్తుందని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

Ashok Gajapathi Raju: రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అశోక్ గజపతిరాజు తీరు

Pusapati Ashok Gajapathi Raju

ఒకప్పుడు టీడీపీలో ఆయన చెప్పిందే వేదం. పార్టీలో నంబర్‌ 2 స్థానంలో ఉండేవారు. కానీ.. కొంతకాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయనే విజయనగరం రాజవంశీయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు. ఇటీవలి కాలంలో పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టకపోయినా.. అడపాదడపా రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం విరుచుకుపడుతున్నారు.

ఈసారి టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న ధీమాలో ఉన్న అశోక్‌ గజపతిరాజు… తన మార్కు రాజకీయాలు మొదలు పెడతారా ? లేదా ? 2019లో అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో టీడీపీ సీనియర్‌ నేతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ చీఫ్‌ చంద్రబాబు నుంచి సీనియర్‌ నేతలు ఎంతోమంది కేసుల్లో చిక్కుకుంటే.. మరికొందరు జైలుకు కూడా వెళ్లొచ్చారు.

ఒకప్పుడు టీడీపీలో నంబర్‌ 2గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. వరుస ఘటనలతో ఆరోగ్యపరంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డా.. వాటన్నింటీ ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేశారు.

ఇప్పుడు అంత యాక్టివ్‌గా లేరు
ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో అశోక్‌ గజపతిరాజు అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. కేవలం తన బంగ్లాకే పరిమితమైన ఆయన.. అప్పుడప్పుడూ క్యాడర్‌ను కలుస్తున్నారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై కూడా అంతగా దృష్టి పెట్టడం లేదన్న ప్రచారం కూడా నడుస్తోంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపు వ్యవహారాన్ని ఆయన ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్న టాక్‌ నడుస్తోంది. సొంత నియోజకవర్గమైన విజయనగరంపై కూడా ఆయన దృష్టి సారించడం లేదని కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2019లో ఎంపీగా పోటీ చేసిన అశోక్ గజపతిరాజు… ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యతో కొంతకాలం జిల్లాకు దూరంగా ఉన్నారు. దాదాపు ఆర్నెళ్ల పాటు హైదరాబాద్‌లో బెడ్ రెస్ట్ తీసుకున్న ఆయన.. జిల్లాకు వచ్చిన తర్వాత ప్రభుత్వ చర్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పూసపాటి వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించి, ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజుకు బాధ్యతలు అప్పగించడం అప్పట్లో పెను సంచలనమైంది.

అదే సమయంలో రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండరామాలయంలో రాముని విగ్రహం ధ్వంసం కేసు కూడా అశోక్ గజపతిరాజు మెడకు చుట్టుకుంది. ఆ కేసులో ఆయన్ని బాధ్యుడ్ని చేస్తూ… ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. అలాగే.. ఆయన చైర్మన్‌గా ఉన్న సింహాచలం, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం పదవుల నుంచి కూడా తొలగించింది. గజపతిరాజు మాత్రం.. వాటన్నింటినీ ఎదుర్కొని న్యాయస్థానం ద్వారా మళ్లీ తన పదవులను దక్కించుకున్నారు.

అదీ ఆయన నైజం..
ఏడుసార్లు శాసన సభ్యునిగా, ఒకసారి ఎంపీగా గెలిచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక మంత్రి పదవులు చేపట్టిన అశోక్ గజపతిరాజుకు… జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించగల సత్తా ఉంది. పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా… అశోక్ ఆశీస్సులు లేనిదే ఎవరికీ దక్కవు. ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలి. ఆయన మనసు తెలుసుకొని… దగ్గరగా ఉంటే అందలం ఎక్కిస్తారు. లేదు, కాదనే వారిని దూరం పెట్టేస్తారు. అదీ ఆయన నైజం. అందుకే జిల్లా టీడీపీలో ఆయన ఆశీస్సుల కోసం నేతలు ఎప్పుడూ పోటీ పడుతుంటారు. కానీ, ఎన్నికల దగ్గరపడుతున్న వేళ… అశోక్ బంగ్లాలో ఆ సందడి కనిపించడం లేదు. ఈసారి ఈ టికెట్ల భారం తనపై పెట్టొద్దని అధిష్టానాన్ని అశోక్ కోరినట్లు సమాచారం.

సొంత నియోజకవర్గం విజయనగరాన్ని తన కుమార్తె అదితి గజపతిరాజుకు త్యాగం చేసిన అశోక్‌.. మౌనముద్రలో ఉండిపోయారు. అయితే.. విజయనగరం ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీచేస్తారన్న చర్చ ఉన్నా.. అశోక్‌ నుంచి మాత్రం అలాంటి సంకేతాలేవీ కనిపించడం లేదు. ఇక ఈసారి జిల్లాలో టికెట్ల కేటాయింపు అధిష్టానమే చూసుకుంటుందన్న సమాచారంతో.. నేతలంతా చంద్రబాబుతో పాటు లోకేశ్‌ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ-జనసేన పొత్తు క్రమంలో విజయనగరం జిల్లాలో టికెట్ల కేటాయింపు జటిలంగా మారింది. ఈ సమయంలో అశోక్‌ గజపతిరాజు మౌనంగా ఉండటంతో క్యాడర్‌లో అసంతృప్తి నెలకొంది. అయితే.. ఆయన మౌనంగా ఉండటానికి వయో భారం కారణమని కొందరు.. ప్రస్తుత రాజకీయాలప వైరాగ్యంగా ఉన్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ.. సందర్భంగా వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న అశోక్‌ గజపతిరాజు.. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా ఈసారి ఎన్నికల్లో అశోక్‌ గజపతిరాజు మార్క్‌ తప్పకుండా కనిపిస్తుందని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మరి మున్ముందు ఆయన రాజకీయ అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Abu Dhabi: మోదీ చేతుల మీదుగా అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం