’జగన్ ది పాదయాత్ర కాదు..విలాసయాత్ర’ : చంద్రబాబు 

  • Publish Date - January 12, 2019 / 07:00 AM IST

అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ’జగన్ ది పాదయాత్ర కాదు..విలాసయాత్ర’ అని ఎద్దేవా చేశారు. ’ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లారు.. నేను 208 రోజులు ఇంటికెళ్లకుండా పాదయాత్ర చేశాను’ అని అన్నారు. పాదయాత్ర పవిత్రతను జగన్ దెబ్బ తీశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్థంతి నిర్వహణపై అమరావతిలో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి హోదాను వ్యతిరేకించే టీఆర్ఎస్ తో జగన్ ములాఖత్ అయ్యారని ఆరోపించారు. కేసీఆర్ తో కలిసి హోదా సాధిస్తానన్న జగన్ చిత్తశుద్ది ప్రజలకర్థమైందన్నారు. టీఆర్ఎస్ తో వైసీపీ లాలూచీకి జగన్ వ్యాఖ్యలే రుజువు అని పేర్కొన్నారు. మోడీ అంటే భయపడే జగన్ ఏపీకి న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే మోడీ 10 శాతం రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని విమర్శించారు. కాపు, ముస్లీం రిజర్వేషన్లపై కేంద్రం చర్యలేవని
ప్రశ్నించారు.

18న ఎన్టీఆర్ 23వ వర్థంతి ఘనంగా జరపాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ రావడం ఒక మైల్ స్టోన్ అని అభివర్ణించారు. మిగిలిన వాళ్లది అందరి మాదిరిగా ఒక కథ..కానీ ఎన్టీఆర్ ది మాత్రం ఒక చరిత్ర అని అన్నారు. నాలుగన్నరేళ్లలో పింఛన్ పది రెట్లు చేశామని తెలిపారు. రైతులకు 9 గంటల కరెంట్ సరఫరా ప్రకటించామని చెప్పారు. అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు