వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది?

నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయి అంటూ షరతులు విధిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారుతోంది.

వైసీపీకి గుబులు పుట్టిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే.. అసలేం జరిగింది?

MLA Venkate Gowda Tension In YCP

MLA Venkate Gowda : వైసీపీ ఎమ్మెల్యేలలో ఈ ఎమ్మెల్యే రూటే సెపరేటు. సీటు వస్తుందా? రాదా? అన్న టెన్షన్ లో మిగతా ఎమ్మెల్యేలు ఉంటే.. ఆ ఎమ్మెల్యే ప్రకటనలు పార్టీ నేతలకు చికాకు పుట్టిస్తున్నాయి. పార్టీ టికెట్ నా జేబులో ఉంది. అయినా నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయి అంటూ షరతులు విధిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారుతోంది.

Also Read : హాట్‌ సీటుగా మారిన విశాఖ పార్లమెంట్‌ స్థానం.. బరిలో ఉండేందుకు పోటీ పడుతున్న నేతలు

అధిష్టానానికే అల్టిమేటమ్..
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తాజా రాజకీయ సంచలనంగా మారారు పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ. గత ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన వెంకట గౌడ.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. రాజకీయంగా బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీమంత్రి అమర్నానాథ్ రెడ్డిని ఓడించారు.

జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు అయిన ఎమ్మెల్యే తాజా వైఖరి పార్టీకి షాక్ ఇస్తోంది. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన వెంకట గౌడకు వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో అన్న గ్యారెంటీ లేకపోయినా.. తాను పోటీ చేయాలంటే ముందుగా పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని అధిష్టానానికే అల్టిమేటం జారీ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

సడెన్ గా ధిక్కార స్వరం..
ఇన్నాళ్లూ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పని చేసిన ఎమ్మెల్యే వెంకట గౌడ.. ఎన్నికల ముందు ధిక్కార స్వరం వినిపిస్తుండటం వైసీపీలో హీట్ పుట్టిస్తోంది. పార్టీలో మార్పుల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న వెంకట గౌడ.. ఏమైందో ఏమో.. పార్టీ టికెట్ తన జేబులో ఉన్నట్లు మాట్లాడుతుండటం రాంగ్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఉందని అంటున్నారు పరిశీలకులు.

పెండింగ్‌లో రూ.40 కోట్లు..
పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎమ్మెల్యేల సదస్సుకు సైతం గైర్హాజరయ్యారు వెంకటగౌడ. తిరుపతిలో జరిగిన ఈ సదస్సుకు వెంకటగౌడ గైర్హాజరుపై రకరకాల ప్రచారం జరిగింది. అయితే, తనతోపాటు తన అనుచరులు చేసిన పనులకు బిల్లులు అవకపోవడంతో అధిష్టానంపై అలిగి తిరుపతి సదస్సుకు వెంకటగౌడ వెళ్లలేదని ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. మరోవైపు సుమారు 40 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. డబ్బు అందితే కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే అధిష్టానంతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

తలుచుకుంటే 100 మందిని తయారు చేసుకోగలం..
అయితే ఎమ్మెల్యే తీరుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు పలమనేరుకు చెందిన వైసీపీ నేతలు. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే వెంకట గౌడ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకట గౌడను తానే రాజకీయాల్లోకి తీసుకువచ్చి, పెద్దిరెడ్డి సహకారంతో గెలిపిస్తే.. ఇప్పుడు అధిష్టానాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు. పలమనేరులో మరో నేత లేరని ఎమ్మెల్యే భావించడం సరికాదని.. తాము తలచుకుంటే వంద మందిని తయారు చేసుకోగలమని అంటున్నారు జడ్పీ చైర్మన్‌.

Also Read : బీజేపీలో ఉంటూ టీడీపీ టికెట్ కోసం పోటీ? ధర్మవరం తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం

మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర..
ఎమ్మెల్యేపై పలమనేరు వైసీపీ నేతలు ఫైర్‌ అవుతున్నా.. ఎమ్మెల్యే మాత్రం స్పందించడం లేదు. తనకు టికెట్‌ ఎందుకు రాదో చూస్తానన్నట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధైర్యం ఎవరికీ అంతుచిక్కడం లేదు. బిల్లుల కోసం అధిష్టానంతో తాడోపేడో తేల్చుకున్నట్లు ఎమ్మెల్యే సంకేతాలిస్తుండటం రాజకీయంగా హీట్‌ పుట్టిస్తోంది. ఈ పరిణామాలపై మంత్రి పెద్దిరెడ్డి కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చాన్స్‌ ఇచ్చి గెలిపిస్తే.. ఇప్పుడు తనను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక పెద్దిరెడ్డి అనుగ్రహం లేకపోతే వైసీపీలో ఎవరికైనా మూడినట్లే అంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో పలమనేరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్‌ ఎలా ఉండబోతోంది? ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నదే చర్చనీయాంశంగా మారింది.