ఏపీకి 3 రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి 3 రాజధానులు అవసరమన్న సీఎం జగన్.. మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు జగన్. మూడు రాజధానుల మేటర్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరూ ఊహించని విధంగా సీఎం చేసిన కామెంట్స్ పట్ల అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకించారు.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం మంచిదే అని కొందరు అన్నారు. ఇది స్వాగతించదగిన, అభినందించదగిన విషయం అన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా మూడు ప్రాంతాల వారికి సమ న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది అన్నారు.
గతంలో హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని కొందరు అంటున్నారు. హైదరాబాద్ ను రాజధానిగా ప్రకటించి బాగా అభివృద్ది చేశాక.. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిందన్నారు. దీంతో ఏపీకి తీరని అన్యాయం, నష్టం జరిగాయి అంటున్నారు. ఏపీ మళ్లీ వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ అవకుండా ఉండాలేంట.. మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అన్నారు. దీంతో మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని, పరిశ్రమలు వస్తాయని, ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుందని, వలసలు తగ్గుతాయని కొందరు అభిప్రాయపడ్డారు.
మరోవైపు 3 రాజధానుల అంశాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు వద్దు ఒకటే ముద్దు అంటున్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించేశారని.. జనాలు అంతా ఫిక్స్ అయిపోయారని.. ఇప్పుడు.. మూడు రాజధానులు అనడం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయపడ్డారు.