టీడీపీకి షాక్ : వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్

  • Publish Date - February 14, 2019 / 11:49 AM IST

హైదరాబాద్ : టీడీపీకి షాక్ తగిలింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అవంతికి పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేయాలని చంద్రబాబుకు సూచించానని ఆయన తన మాట వినలేదని అవంతి అన్నారు.

 

చంద్రబాబు అవకాశవాది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్నాలు, దీక్షలతో చంద్రబాబు ఏమీ సాధించలేరన్నారు. హోదా విషయంలో జగన్ ఒకే విధానంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న చంద్రబాబు…అదే కాంగ్రెస్ తో చేతులు కలపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల ముందు స్కీమ్ లు పెడితే ఓట్లు పడవన్నారు. రాష్ట్రంలో అవినీతి వల్లే కేంద్రం నుంచి నిధులు ఆగాయన్నారు.