రేపే విడుదల! : చింతమనేనికి బెయిల్

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో జిల్లా కోర్టు 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
చింతమనేని పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
చింతమనేనితో పాటూ మరికొందరు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల కారణంగా ఆయన అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఎస్పీ ఎదుట లొంగిపోవడానికి వెళ్లే ముందు..ఆవిడను చూడటానికి దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు చేరుకోవడం…పోలీసులు అరెస్టు చేయడం జరిగిపోయాయి. తాను మళ్లీ ప్రజా పోరాటాలతో బయటకు వస్తుంటే..చూడలేక అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఇటీవలే వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చింతమనేని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
Read More : నా బస్సులే ఎందుకు : కక్ష సాధింపు చర్యలు – జేసీ