ఏం జరగనుంది : చంద్రబాబు అమరావతి టూర్ పై టెన్షన్

మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...

  • Publish Date - November 28, 2019 / 01:58 AM IST

మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు…

మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు… క్యాపిటల్‌లో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించనున్నారు. ఓవైపు ఆయన పర్యటనకు ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేయగా… మరోవైపు పర్యటనను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు అంతా రెడీ అయింది. ఇవాళ్టి(నవంబర్ 28,2019) తన పర్యటనలో భాగంగా చంద్రబాబు… పలు నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి పర్యటన ప్రారంభించనున్న చంద్రబాబు… అమరావతిలోని ఎమ్మెల్యేలు, ఐఏఎస్ క్వార్టర్స్, హైకోర్టు, సెక్రటేరియట్, సీడ్‌ యాక్సిస్ రోడ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. అయితే… అమరావతిని స్మశానంలా మార్చారంటూ అధికార పక్షం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్న వేళ… చంద్రబాబు ఈ పర్యటన చేపడుతుండటం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది.

అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే టీడీపీ నేతలు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వగా… వైసీపీ ఎదరుదాడికి టీడీపీ భయపడబోదన్నారు చంద్రబాబు. రాజధాని నిర్మాణంపై నిజాలను తమ పార్టీ నేతలు ప్రజల ముందుంచారని, ఇవాళ్టి పర్యటన ద్వారా వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. రాజధానిలో కూర్చుని వాస్తవాలను మాట్లాడాలని, అధికార పక్షానికి అదిరిపోయే జవాబు ఇవ్వాలని భావిస్తున్నారు. 

ప్రభుత్వానికి కౌంటర్‌ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తుంటే.. మరోవైపు ఆయనకు షాకిచ్చేందుకు రాజధాని రైతులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండుగా చీలిపోయిన రాజధాని ప్రాంత రైతుల్లో ఓ వర్గం… చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటోంది. భూ సేకరణ పేరిట చంద్రబాబు మోసం చేశారని ఆరోపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతల ఎదుట నిరసనలు తెలపడంతోపాటు రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రహదారి ఎదుట దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా నల్లజెండాలు ఎగురవేశారు. తమను మోసం చేసిన బాబును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటున్నారు.  

మరోవర్గం రైతులు మాత్రం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తోంది. అటు.. టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుందని చెబుతున్నారు. స్మశానం అంటూ విమర్శిస్తున్న పాలకుల కళ్లు తెరిపించడంతోపాటు తమ హయాంలో చేసిన నిర్మాణాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందంటున్న టీడీపీ… ప్రభుత్వ అజ్ఞానాన్ని ప్రజలకు చూపిస్తామంటోంది. అయితే.. అప్పుడు భూములిచ్చి సహకరించిన రైతులే ఇపుడు ఆయన పర్యటనను అడ్డుకుంటామనడం, రాజధాని గ్రామాలు నివురుగప్పిన నిప్పులా మారడంతో… ఏం జరుగుతుందోననే టెన్షన్‌ నెలకొంది.