దాడులు..ప్రతిదాడులు, గొడవలు.. ధర్నాలు.. ఎన్నికలు ముగిసినా ఏపీలో ఘర్షణలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఓటింగ్‌కు సంబంధించి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటన జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు శాంతిభద్రతలను కాపాడేందుకు పలుచోట్ల పోలీసు పహారా కొనసాగుతూనే ఉంది.
నవ్యాంధ్రప్రధేశ్‌లో ఎన్నికల సమయంలో మొదలైన గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మధ్య తలెత్తిన వివాదం పోలింగ్ ముగిసి 24 గంటలు పూర్తయినా అక్కడ ఘర్షణలు మాత్రం అదుపులోకి రావడం లేదు.
ఆళ్లగడ్డలో పోలింగ్‌ను అడ్డుకోడానికే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి భూమా అఖిలప్రియ. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాము గొడవలకు దూరంగా ఉన్నామని, అయినప్పటికి మా పైదాడికి యత్నించారని ఆమె తెలిపారు. ఎన్నికల కమిషన్ భద్రత కల్పించడంలో విఫలమైందంటూ ఆమె మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పోలీసులు భారీగా మోహరించారు. నిన్న ఘర్షణల్లో చనిపోయిన టీడీపీ నేత చింతా భాస్కర్‌రెడ్డి మృతదేహాన్ని వీరాపురానికి తరలించారు. ఘటనా స్థలానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి కూడా చేరుకున్నారు. మరోవైపు న్యాయం జరిగే వరకూ అంత్యక్రియలు జరిపేది లేదని మృతుని బంధువులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం గంగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వైసీపీ ఏజెంట్ లక్ష్మారెడ్డిని గురువారం మఠం మండలం ఎస్సై రాజగోపాల్ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నిన్నటి నుంచి అతని జాడ తెలియకపోవడంతో.. మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వేలాది మంది కార్యకర్తలతో బ్రహ్మంగారి మఠం మండల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిన్న అరెస్ట్ చేసిన ఏజెంట్ లక్ష్మిరెడ్డిని తమకు చూపించాలంటూ రఘురామిరెడ్డి పోలీసులను కోరారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించడంతో .. వేలాది మంది కార్యకర్తలతో నిరసనకు దిగారు. చివరకు సీఐ, ఎస్ఐలు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ విషయమంపై తాము ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.
గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నాకు దిగారు. వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున బూతుమల్లి టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడారంటూ.. ఆయన నిరసన వ్యక్తం చేశారు. మేరుగ నాగార్జునని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, బూతుమల్లి టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు గుంటూరు జిల్లాలోనూ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పిడుగురాళ్ళ మండలంలోని జూలకల్లు గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగిందని సీఐ రవీంద్ర బాబు తెలిపారు.
మరోవైపు తిరుపతి చంద్రగిరిలోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతకు చెందిన రెండు బైకులు దగ్ధమయ్యాయి. దీనిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదంతా చెవిరెడ్డి కుట్రేనని.. చెవిరెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్మలగుంటలో నా భార్యపై దాడి చేసేందుకు యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.