ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ కు, ఆ పార్టీ సీనియర్ నేతలకు చావో రేవో అనే పరిస్థితిని కల్పించాయి.
నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్… పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా… ఈ ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సార్వత్రిక సమరం గంట మోగడంతో కాంగ్రెస్ నేతలంతా అభ్యర్థులను ఖరారు చేయడంలో మునిగిపోయారు. టీఆర్‌ఎస్ ప్రవాహంలో ఎదురీదేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ప్రతి ఎన్నికల్లోనూ చివరి నిముషంలో అభ్యర్థులను ప్రకటించే అలవాటున్న కాంగ్రెస్ కూడా ఈసారి ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా తన కంచుకోటగా ప్రకటించుకున్న కాంగ్రెస్‌కు.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జానారెడ్డి, కోమటిరెడ్డిలాంటి నేతలు ఓటమిపాలయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో మూడింటితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2014 ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీచేసి లక్షా 93వేల మెజార్టీతో గెలుపొందారు. భువనగిరిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. భువనగిరి నుంచి రెండుసార్లు కాంగ్రెస్ తరపున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఈ రెండు లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ సతీమణి పద్మావతి పార్లమెంట్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మధుయాష్కి భువనగిరి సీటుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
జానారెడ్డి నల్లగొండ లోక్‌సభ టికెట్ ఆశిస్తుండగా… కోమటిరెడ్డి రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీచేయడానికైనా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నల్లగొండ నుంచి జానారెడ్డి, భువనగిరి నుంచి వెంకటరెడ్డి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ శ్రేణులే విస్తృత ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానాలుగా గుర్తించిన జాబితాలో నల్లగొండ, భువనగిరి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహులు ఈ రెండు స్థానాలపై ఆసక్తి చూపుతున్నారు.
నల్లగొండ లోక్‌సభ పరిధిలో నల్లగొండతోపాటు దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉంది. దీంతో బలమైన అభ్యర్థి తోడైతే కాంగ్రెస్‌కు గెలుపు నల్లేరుపై నడకేనని కేడర్ భావిస్తోంది. ఇక భువనగిరి లోక్‌సభ పరిధిలో భువనగిరితోపాటు మునుగోడు, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. తుంగతుర్తిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా.. కేడర్ అంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని నాయకత్వం భావిస్తోంది. ఇక్కడ కూడా బలమైన అభ్యర్థిని నిలిపితే విజయం కాంగ్రెస్‌దేనన్న ధీమా నేతల్లో నెలకొంది. భువనగిరి నుంచి రేస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ కు, ఆ పార్టీ సీనియర్ నేతలకు చావో రేవో అనే పరిస్థితిని కల్పించాయి. సీనియర్లుగా పోటీకి దూరంగా ఉంటే అధిష్టానం వద్ద మైనస్ అవుతుంది. అదే సమయంలో పోటీ చేసి ఓడిపోయినా మైనసే అవుతుంది. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలవలేరు అనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సీనియర్ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. వారికి గెలుపు ఇప్పుడు అవసరం. ఆ గెలుపు కోసమే నేతలంతా కలిసికట్టుగా సాగుతారో.. లేక ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఓటమిని చవిచూస్తారో త్వరలోనే తేలనుంది.