హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు స్వాధీనం!

హైదరాబాద్ నగరంలో భారీగా హవాలా నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ సమీపంలో రూ.కోటి హవాలా సొమ్మును వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హవాలా సొమ్ము తరలింపునకు సంబంధించి పలు విషయాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దుబ్బాక ఎన్నికల కోసం కోట్ల రూపాయల నగదును తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు.
డబ్బులు తరలిస్తున్న వ్యక్తి దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిదిగా గుర్తించినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక సమాచారం ఉందనన్నారు. కోటి రూపాయలు, ఇన్నోవా కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీపీ చెప్పారు.
రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాస్ రావుతో పాటు కారు డ్రైవర్ రవికుమార్‌ను అరెస్ట్ చేశామన్నారు. సీజ్ చేసిన డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తామని సీపీ అంజనీ కుమార్ చెప్పారు.