ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ.. జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ఆగడం లేదు. పార్టీలో చేరడానికి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు కూడా చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన జాయిన్ అయ్యారు. చిన్నికృష్ణతో పాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్ పార్టీలో చేరారు. వారికి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు ఏపీలో నవధాన్యాలుగా విరాజిల్లుతాయని నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు. తన సినీ జీవితం రజినీకాంత్‌తో ప్రారంభమైందని.. రాజకీయ జీవితం జగన్ తో ఆరంభం అయిందని తెలిపారు. జగన్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రతి పుట్టిన రోజున కలిసేవాడినని గుర్తుచేశారు. వైఎస్సార్ మహానేత అని కొనియాడారు. టీడీపీ తుడిచి పెట్టుకుపోవాలంటే జగన్‌ను బలపరిచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.