ఉద్యమకారుల కొట్లాట.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ వివాదం ఏ మలుపు తీసుకోనుంది?

గవర్నర్ ఇంకా ఆమోదించకపోయినా, కోదండరాం, అమీర్ అలీఖాన్‌ పేర్లపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇప్పటికీ మొండిపట్టుదలే ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్‌కు లేఖ రాశారు. ఒక ఉద్యమ నేతగా.. సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ అభ్యర్థిస్తున్నారు దాసోజు.

ఉద్యమకారుల కొట్లాట.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ వివాదం ఏ మలుపు తీసుకోనుంది?

Gossip Garage : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం ఉద్యమకారుల కొట్లాటకు ఫుల్‌స్టాప్ పడదా…? ఇప్పటికే ఒకసారి గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన ఉద్యమకారుడు… ప్రభుత్వం తనకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారా? ఈ పరిణామాలు చట్టసభలో అడుగుపెట్టాలనే ఉద్యమనేతకు చికాకు పుట్టిస్తున్నాయా? ఇంతకీ చట్టసభలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్న ఆ ఇద్దరు ఉద్యమకారులు ఎవరు? ఈ యుద్ధంలో గెలిచేదెవరు?

ప్రభుత్వానికి సవాల్‌గా మారిన పెద్దల సభకు సభ్యుల ఎంపిక..
తెలంగాణలో పెద్దల సభకు సభ్యుల ఎంపిక ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం ఎటువంటి మలుపు తీసుకుంటుందోననే చర్చ జరుగుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉద్యమ నేత, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, సియాసిత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఐతే ఈ ఇద్దరి పేర్లను గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయగా, వెంటనే ఆమోదం లభించింది. ఐతే ఈ నియామకంపై ప్రతిపక్షానికి చెందిన ఉద్యమకారుడు దాసోజ్ శ్రవణ్ అభ్యంతరం చెబుతూ కోర్టుకు ఎక్కడంతో ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత మరోసారి ప్రభుత్వ పరిశీలనకు కోర్టు ఆదేశించడంతో…. తాజాగా మళ్లీ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లనే సిఫార్సు చేసింది ప్రభుత్వం.

రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో తిరస్కరించిన అప్పటి గ‌వ‌ర్నర్ త‌మిళిసై..
గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం సభ్యులను నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ కోటాలో రెండు ఖాళీగా ఉన్నాయి. వీటికి గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే ఈ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో అప్పటి గవర్నర్ తమిళిసై ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించ లేదు. ఇద్దరి పేర్లను తిరస్కరించారు. ఈలోగా ఎన్నికలు రావడం… బీఆర్ఎస్ సర్కార్ ఓడి.. కాంగ్రెస్ అధికారం చేపట్టడం చకచకా జరిగిపోయింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫార్సు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనికి అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.

కోదండరాం పేరుకు ఎలా ఆమోదం తెలుపుతారని వాదన..
అయితే గవర్నర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో కేసు వేయడంతో ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పెండింగ్‌లో పడిపోయింది. తాము రాజకీయ నేపథ్యం ఉన్నవారమంటూ గవర్నర్ తమ నియామకాలను తిరస్కరించిందని… ఇప్పుడు కోదండరాం పేరుకు ఎలా ఆమోదం తెలుపుతారన్నదే దాసోజు వాదన. ఏకంగా జనసమితి అనే పార్టీ అధ్యక్షుడిని గవర్నర్ కోటాలో నియమించడం ఎలా సరైందంటూ ప్రశ్నిస్తున్నారు శ్రవణ్‌.

మళ్లీ కోర్టుకు వెళతానని దాసోజు శ్రవణ్‌ హెచ్చరిక..
ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం కోర్టుకెక్కడంతో 8 నెలలుగా పెండింగ్‌లో పడిపోయింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పిటిషన్లను విచారించిన హైకోర్టు… కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను అమలు చేయకుండా హోల్డ్‌లో పెట్టేసింది. కొత్తగా మళ్లీ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. ఐతే ప్రభుత్వం తాజాగా కోదండరాం పేరును సిఫార్సు చేయడం, దీనిపై మళ్లీ కోర్టుకు వెళతానని దాసోజు శ్రవణ్ హెచ్చరిస్తుండటంతో ఈ పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది.

గవర్నర్ వద్ద పెండింగ్..
గవర్నర్ మారడం.. ఇన్‌చార్జ్ గవర్నర్ కొంత కాలం ఉండటంతో ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల భర్తీ అంశం ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ తెరపైకి వచ్చింది. లాస్ట్ క్యాబినేట్ సమావేశంలో ఖాళీ ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ కోదండరాం, అమీర్ అలీఖాన్‌ పేర్లను క్యాబినెట్ లో తీర్మానించారు. ప్రస్తుతం ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది.

స‌హ‌చ‌ర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ కోదండరామ్‌కి లేఖ..
గవర్నర్ ఇంకా ఆమోదించకపోయినా, కోదండరాం, అమీర్ అలీఖాన్‌ పేర్లపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఇప్పటికీ మొండిపట్టుదలే ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్‌కు లేఖ రాశారు. ఒక ఉద్యమ నేతగా.. సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ అభ్యర్థిస్తున్నారు దాసోజు. క్యాబినెట్ సిఫార్సును గవర్నర్ ఆమోదిస్తే.. మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానంటూ హెచ్చరిస్తున్నారు. పాత కేసు కూడా ఇంకా కంప్లీట్ కాలేదని… ప్రభుత్వం మాత్రం గవర్నర్ కోటా అంశానికి పాత పేర్లనే మళ్లీ పంపడంపై కోర్టులో సవాల్ చేస్తానంటున్నారు శ్రవణ్. దీంతో ఉద్యమకారులైన ప్రొఫెసర్ కోదండరాం, శ్రవణ్ మధ్య ఎమ్మెల్సీ వార్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Also Read : అసంతృప్తితో రగిలిపోతున్న ఆ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ సడెన్‌గా ఎందుకు సైలెంట్‌ అయ్యారు? కారణం అదేనా..