మినిస్టర్స్ Vs సిట్టింగ్స్ : గెలిచేదెవరు ? ఓడేదెవరు ?

నెల్లూరు : జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్నికల పోరు.. హోరాహోరీగా జరుగనుంది. అక్కడ మంత్రులు వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య సమరం సాగనుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ అభ్యర్ధులు ఒకరికొకరు ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రజా బలమే మా ఆయుధమని వైసీపీ చెబుతుంటే.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మాకు విజయాన్ని అందిస్తాయంటోంది టీడీపీ. మరి.. ఎన్నికల్లో గెలిచేదెవరు ? ఓడేదెవరు ?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే జిల్లాలో ప్రధానంగా పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య కొనసాగనుంది. కడప తరువాత వైసీపీకి నెల్లూరు జిల్లానే కంచుకోట. గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 3 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అందులో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సారి వైసీపీ కంచుకోటలో పాగావేయాలని భావించిన సిఎం చంద్రబాబు .. ఈ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకోసం అంగ, అర్ధ బలమున్న నాయకులను ఇక్కడి నుంచి రంగంలోకి దింపారు. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మంత్రి సోమిరెడ్డిలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇరు పార్టీల్లో బలమైన అభ్యర్ధులు పోటీ పడుతుండడంతో .. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి.
నెల్లూరు సిటీలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై టీడీపీ అధినాయకత్వం మంత్రి నారాయణను పోటీకి దింపింది. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనీల్ కుమార్ యాదవ్ .. ప్రజారాజ్యంపార్టీ అభ్యర్థి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఎవరి చేతిలోనైతే ఓడారో.. ఆయన మీదే తిరిగి గెలిచారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా.. అనిల్ కుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఫైర్ బ్రాండ్‌గా మారారు. నిత్యం ప్రజల్లో ఉంటూ నియోకవర్గ సమస్యల మీద దూకుడుగానే వ్యవహరించారు. తన సొంత నిధులతో నియోజకవర్గ ప్రజలకు పలు సంక్షేమ పథకాలు పెట్టి, వారి అభివృద్ధికి కృషి చేశారు. అయితే మంత్రి నారాయణను రానున్న ఎన్నికల్లో అనిల్ పై పోటీకి దించింది తెలుగుదేశం. మంత్రి హోదాలో ఉన్న నారాయణ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నారాయణ కాపు, ముస్లిం మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని నారాయణ చెబుతున్నారు. అయితే, నిత్యం ప్రజలతో మమేకమయ్యే అనిల్‌ను ఓడించటం అంత సులువు కాదన్నది వైసీపీ నేతల వాదన. మరి ఇక్కడ ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
నెల్లూరు రూరల్ విషయానికి వస్తే.. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీ ఎన్నికల బరిలోకి దింపింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి శ్రీధర్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడం, పలు సంక్షేమ కార్యక్రమలను తన సొంత నిధులతో ఏర్పాటు చేయడంతో పాటు .. పాదయాత్రలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తల అరెస్టుపై పోలీసులను ప్రశ్నించి జైలు పాలై కొంత సింపతిని కూడా పొందారు. అయితే ఎంపీగా పోటీ చేయటానికి సుముఖంగా లేకపోవటంతో .. ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ కేటాయించారు. ఆదాల మాజీ మంత్రి కూడా. అంగ బలం, ఆర్థిక బలంతో ఎన్నికల వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తారన్న నాయకుడిగా ఈయనకు గుర్తింపు ఉంది. ఇక తెలుగుదేశం .. ఈ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేస్తోంది. మరోవైపు రూరల్ నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులెవరినీ ఆదాల పట్టించుకోవడంలేదన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఇక్కడ పోటీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ మొదలైంది. సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని టీడీపీ..స్థానికంగా తాము ప్రజలతో కలిసి వారి కోసం చేసిన పనులు తమను గెలిపిస్తాయని వైసీపీ చెబుతున్నాయి.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టీడీపీ ఖరారు చేసింది. ఇక్కడ నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. సోమిరెడ్డి, కాకాణి ఇద్దరూ రెండోసారి తలపడుతున్నారు. సోమిరెడ్డి సర్వేపల్లిలో రెండు సార్లు గెలవగా.. మూడు సార్లు ఓడిపోయారు. అయితే కాకాణి, సోమిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ సోమిరెడ్డి అంటే.. వాటిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని కాకాణి అంటారు. ఇలా నిత్యం వీరి మధ్య వివాదాలు, ఆరోపణలు.. ప్రత్యారోపణలు, విమర్శలు.. ప్రతివిమర్శలు, వార్తల్లోకెక్కని రోజంటూ ఉండదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు నాయకులు ఎన్నికల్లో తలపడనుండడంతో.. నియోజకవర్గంలో రాజకీయాలు వాడీవేడీగా మారాయి. నేతలిద్దరూ ప్రచారంలో మునిగితేలుతూ సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి అయిన సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని భావిస్తుంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపు మరోసారి ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు.