జగన్ పై దాడి కేసు : శివాజీని విచారించనున్న NIA

విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరుగుతుందని ముందే సినీ నటుడు శివాజీకి ఎలా తెలుసు ? విచారిస్తే ఈ కేసు చిక్కుముడి వీడుతుందా ? అని ఎన్ఐఏ భావిస్తోంది. ఆపరేషన్ గరుడలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరుగుతుందని ముందే శివాజీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
శివాజీ మీడియా సమావేశం :
గత ఏడాది మార్చిలో శివాజీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ గరుడ గురించి వివరించారు. ఏపీలోని ప్రతిపక్ష నేతపై ప్రాణహానీ లేని దాడి జరుగుతుందని…ఇప్పటికే హైదరాబాద్, గుంటూరులో రెక్కీ కూడా నిర్వహించారని శివాజీ వెల్లడించారు. ఈ కారణంగా అల్లర్లు సృష్టించవచ్చని…తెలిపారు. అయితే..ఈ విషయం ముందే శివాజీకి ఎలా తెలుసని ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. దాడి అనంతరం అల్లర్లు కూడా జరిగే అవకాశం ఉందని శివాజీ ఎలా వెల్లడిస్తారు ? తదితర ప్రశ్నలకు జవాబు రావాలంటే ఆయన్ను విచారిస్తే సరిపోతుందని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు…మూడు రోజుల్లో శివాజీని విచారించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి విచారణకు శివాజీ సహకరిస్తారా ? విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడిస్తారో చూడాలి.
2018, అక్టోబర్ 25న జగన్‌పై దాడి :
గతేడాది అక్టోబర్ 25న జగన్‌పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. అనంతరం సిట్..ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విచారించారు. తాను సంచలనం కోసమే దాడి చేయడం జరిగిందని శ్రీనివాసరావు పేర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. జనవరి 18వ తేదీ మాత్రం తాను రాసుకున్న డైరీ ఇవ్వడం లేదని కోర్టు ఎదుట శ్రీనివాసరావు వేడుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.