చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఊరికి కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
గుంటూరు : చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఊరికి కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఎన్నికలు రాకుంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవారా? అని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఏమీ మేలు జరుగలేదని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటున్నారని తెలిపారు.
ఈసీ ఆదేశాలను కూడా చంద్రబాబు పక్కనపెట్టారని తెలిపారు. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు జగన్. విశాఖ ఎయిర్ పోర్టులో తన మీద హత్యాయత్నం జరిగితే..బాబు స్క్రిప్టును డీజీపీ చదివి వినిపించారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దిగజారిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేకపోతే..ప్రజలకు ఏం రక్షణ ఉన్నట్లని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి సొంత బాబాయినే హత్య చేయించారని ఆరోపించారు. ఆ నేరాన్ని కుటుంబ సభ్యులపైనే వేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? అని అన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు తన పాలనపై ప్రజల్లో చర్చ జరుగకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది బాబు కుట్రలు తారాస్థాయికి చేరుతాయన్నారు. ప్రతి గ్రామానికి డబ్బుల మూటలు పంపిస్తారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేల కోసం మోసపోవద్దన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయని చెప్పారు.