ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ఆలోచించాలి…రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
తాను పోలీసులను కించపరిచేలా మాట్లాడలేదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. భయపెట్టాలనే ఉద్దేశంతోనే తనను 7 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచారని విమర్శించారు. తనకు గుండె జబ్బు, బీపీ, షుగర్ వ్యాధులున్నాయని లిఖితపూర్వకంగా ఇచ్చినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
పోలీసులకు భయపడం..ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని అన్నారు. రిమోట్ ద్వారానే పోలీసు పాలన సాగుతోందని విమర్శించారు. ఇదే విధానం ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తే ప్రమాదకరం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీ ఆలోచించాలి…రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
అనంతపురం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎట్టకేలకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదలయ్యారు. దాదాపు ఏడు గంటల పాటు జేసీని పోలీస్ స్టేషన్‌లోనే కూర్చోబెట్టిన పోలీసులు… చివరకు ఆయన్ని విడుదల చేశారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేసీ దివాకర్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇటీవల జరిగిన ఓ టీడీపీ కార్యకర్తల సమావేశంలో జేసీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్న ఆయన..తమ గవర్నమెంట్ వచ్చాక బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో జేసీ ఈ కామెంట్స్ చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. జేసీ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఓ రేంజ్‌లో ఫైరయ్యింది. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడి ఫిర్యాదుతో ఆయనపై అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 153, 506 కింద కేసు నమోదైంది.
ఇక ఈ కేసుపై జేసీ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. నెలకు రెండుసార్లు సమీప పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయలని కోర్టు జేసీ దివాకర్ రెడ్డిని ఆదేశించింది. అయితే సరైన పత్రాలు సమర్పించలేదని జేసీని స్టేషన్‌లోనే ఉంచారు పోలీసులు. ఉదయం నుంచి దాదాపు ఏడు గంటల పాటు జేసీ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న జేసీని కలిసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. అయితే స్టేషన్ లోపలికి అనుమతి లేదంటూ వారిని పోలీసులు గేటు బయటే నిలబెట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులది నియంతృత్వ పాలన అంటూ నినాదాలు చేస్తూ నాయకులు ఆందోళనకు దిగారు. ఆందోళనలో భాగంగా ఓ టీడీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇక జేసీని పోలీస్ స్టేషన్‌లో నిర్భందించడాన్ని మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జేసీని కలవకుండా ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు.