టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పార్టీ చీఫ్ చంద్రబాబునే టార్గెట్ చేశారు. మమ్మల్ని ముంచింది చంద్రబాబే అని జేసీ అన్నారు. శాంతి శాంతి అంటూ చంద్రబాబు మమ్మల్ని సంకనాకించారని వాపోయారు. శాంతి వచనాలతో చంద్రబాబు మా బతుకులు నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబులో కూడా మార్పు రావాలని, శాంతి వచనాలు పక్కన పెట్టాలని జేసీ కోరారు. ‘జగన్ మీ కొడుకా.. మీ తమ్ముడా.. నీ హితుడా’ అంటూ బాబుని ప్రశ్నించిన జేసీ… చంద్రబాబు సాధు జంతువులా ఉండొద్దని సూచించారు. బుధవారం(డిసెంబర్ 18,2019) అనంతపురం జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ముందే జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ మరో రాజారెడ్డి :
గతంలో మన ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యేలే 100 శాతం నయమన్నారు. చప్పట్లు కొట్టే వాళ్లను పట్టించుకోవద్దని హితవు పలికారు జేసీ. అటు సీఎం జగన్ పైనా జేసీ ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న మంచి లక్షణాల్లో 10శాతం కూడా జగన్‌లో లేవని చెప్పారు. జగన్ మరో రాజారెడ్డి అని అన్నారు. అచ్చం రాజారెడ్డి లక్షణాలతో జగన్ ఉన్నాడని.. ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టు అని డీజీపీపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాం :
పోలీసులపైనా మరోసారి జేసీ నిప్పులు చెరిగారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జేసీ మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని బెదిరించారని జేసీ చెప్పారు. ‘టీడీపీలో ఏం పనిరా.. పోయి వైసీపీలో చేరు.. లేకపోతే బొక్కలో తోస్తా’ అని బెదిరించారని చెప్పారు. కానీ ఎస్పీ మంచి వ్యక్తి కావడంతో ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. అనంతపురం జిల్లాలో ఎస్పీ మినహాయిస్తే.. పోలీసులు అందరూ వైసీపీ నేతలకు వంగి, వంగి దండాలు పెడుతున్నారని జేసీ ఆరోపించారు.
త్వరలో అధికారంలోకి వస్తాం :
రెండున్నరేళ్లలోనే ఎన్నికలు వస్తాయని జేసీ మరో బాంబు పేల్చారు. అప్పుడు మేమే గెలుస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అందరి అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చాక బూట్లు నాకే పోలీసుల్ని తెచ్చుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలను బెదిరించిన వారిపై సారా, గంజాయి కేసులు పెట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేబుల్లో గంజాయి పెట్టి మరీ గంజాయి కేసుల్లో ఇరికిస్తామన్నారు జేసీ దివాకర్ రెడ్డి.
జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ :
* మమ్మల్ని ముంచింది చంద్రబాబే
* శాంతి శాంతి అంటూ సంకనాకిచ్చారు
* చంద్రబాబు మారాలి
* సాధు జంతువులా ఉండొద్దు
* జగన్ మరో రాజారెడ్డి
* రెండున్నరేళ్లలో ఎన్నికలు
* అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం
* బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటాం
* టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధించిన పోలీసులను గుర్తు పెట్టుకుంటా
* జేబుల్లో గంజాయి పెట్టి మరీ గంజాయి కేసుల్లో ఇరికిస్తాం
* అక్రమ కేసులు పెట్టి పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు