Leaders like Kharge can't bring change says Tharoor
Congress President Poll: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గేతో మార్పు సాధ్యం కాదని ఆయనకు పోటీదారైన శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తాము శత్రువులం కాదంటూనే మరోవైపు మెత్తటి విమర్శలు చేస్తుండడం గమనార్హం. ఆదివారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో థరూర్ మాట్లాడుతూ ఖర్గేను గెలిపిస్తే ఇప్పటికే ఉన్న వ్యవస్థను కొనసాగిస్తారని, అయితే మార్పు రావాలంటే తనను ఎన్నుకోవాలని అన్నారు.
‘‘మేము శత్రువులం కాదు, ఇది యుద్ధమూ కాదు. మా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది. ఖర్గేను ఎన్నుకోవడం జరిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలోని మొదటి వరుసలో ఉండే ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. ఇప్పటి వరకు ఉన్న విధానాల్నే ఆయన కొనసాగిస్తారు. కానీ పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి మార్పులు కావాలంటే నన్ను ఎన్నుకోవాలి. పార్టీలో మార్పులు తీసుకువస్తానని కాంగ్రెస్ కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నాను’’ అని థరూర్ అన్నారు.
కాగా, ఇదే ఎన్నికపై ఖర్గే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. తాను ఎవరినీ ఎదిరించడం కోసమో, అధ్యక్ష స్థానం కోసం పోటీపడటం లేదని.. పార్టీని బలోపేతం చేసేందుకే పార్టీ అత్యున్నత పదవి రేసులోకి దిగానని ఖర్గే అన్నారు. అధ్యక్ష ఎన్నికను ఏకగ్రీవం చేసేలా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అని విలేకరుల ప్రశ్నించగా.. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని అన్నారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎన్నుకోవడం మంచిదని గతంలో తాను థరూర్‌కు సూచించినప్పటికీ.. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని తాను అనుకుంటున్నానని అన్నారు. థరూర్ తనకు చిన్న సోదరుడు లాంటి వాడని, తామందరి లక్ష్యం పార్టీని బలోపేతం చేయటమేనని ఖర్గే తెలిపారు.
Congress President Poll: కాంగ్రెస్ అత్యున్నత పదవి రేసులో ఇద్దరూ దక్షణాది నేతలే