Munugodu By Election
Munugodu By Election: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు తెలిపింది. ఈ ఎన్నికలో తమకు మద్దతివ్వాలని సీపీఐని టీఆర్ఎస్ కోరడంతో అందుకు ఆ పార్టీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని సీఎం కేసీఆర్ అధికారిక భవనం ప్రగతిభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక అంశంపై వారు చర్చించారు. సీఎం కేసీఆర్ తో జరిగిన చర్చపై చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం కాసేపట్లో సమావేశం కానుంది.
సమావేశం అనంతరం సీపీఐ మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు అంశంపై అధికారికంగా ప్రకటన చేయనుంది. నేడు మునుగోడులో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సభకు కూడా సీపీఐ నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రారంభించాయి. మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ ఎన్నికలో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటవచ్చని పార్టీలు భావిస్తున్నాయి.