ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.
ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు. రాజధానిని తరలించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రాజధాని రైతులతో పవన్ మాట్లాడారు. రాజధాని తరలింపు వార్తలపై వారితో చర్చించారు. రాజధాని ఎక్కడికీ పోదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజధానిగా అమరావతి సేఫ్ కాదన్న బొత్స వ్యాఖ్యలను పవన్ తప్పుపట్టారు. విధ్వంసం కలిగించే వార్తలు జగన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తులు, కుటుంబసభ్యులు, సన్నిహితులెవరూ ఇవ్వరని అన్నారు. బొత్సగారు.. జగన్ రెడ్డి మాయలో పడకండి అని పవన్ అన్నారు. పీసీసీ చీఫ్ గా చేసి ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం కావాలనుకున్న మీరు అనుభవంతో మాట్లాడండి అని బొత్సకు పవన్ సూచించారు. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అని పవన్ అన్నారు.
ప్రజల అభిమానాన్ని సంపాదించండి అని పవన్ హితవు చెప్పారు. బొత్సకు మనసులో ఎక్కడో మారుమూల సీఎం కావాలన్న కోరిక ఉందన్నారు. మీ ప్రభుత్వానికి మీరు కూడా సీఎం కావొచ్చని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడాలి అని పవన్ హితవు పలికారు. ప్రజలను కన్నీరు పెట్టిస్తే ఆ ప్రభుత్వానికి మనుగడ ఉండదని హెచ్చరించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదనేది గుర్తు పెట్టుకోవాలన్నారు.
ప్రధాని మోడీ అనుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు, వైసీపీ ఓడిపోవచ్చు అని పవన్ అన్నారు. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించడం అంటే.. ప్రధాని మోడీ, అమిత్ షా లను వ్యతిరేకించినట్టే అని పవన్ చెప్పారు. రైతులు భూములిచ్చింది ఏపీ ప్రభుత్వానికి.. వ్యక్తులకు కాదు అని పవన్ గుర్తు చేశారు. అమరావతి రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన ప్రతి రైతుకి జనసేన అండగా ఉంటుందన్నారు. ప్రజల కోసం మాట్లాడేందుకే పార్టీ స్థాపించా అన్నారు. రైతులు ఆందోళన చూసే రెండు రోజుల పాటు రాజధానిలో పర్యటించాను అని పవన్ వెల్లడించారు.