కశ్మీర్ సమస్యని సమర్థవంతంగా పరిష్కరించారు : ప్రధాని మోడీపై పవన్ ప్రశంసలు

  • Publish Date - August 31, 2019 / 12:34 PM IST

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రధాని మోడీ చాలా సమర్థవంతంగా పరిష్కరించారని కొనియాడారు. అవినీతి సహించని వ్యక్తి ప్రధాని మోడీ అని కితాబిచ్చారు. మోడీ తనకు వ్యక్తిగతంగా తెలుసు అని పవన్ చెప్పారు. జగన్ ప్రభుత్వంపై మోడీ సర్కార్ ఓ కన్ను ఉందన్న విషయం మర్చిపోవద్దని పవన్ హెచ్చరించారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో రాజధాని రైతులతో పవన్ సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సమావేశం తర్వాత మాట్లాడిన పవన్ సంచలన, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్.. ప్రధాని మోడీని ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఏపీకి అన్యాయం చేశారని బీజేపీ, ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన పవన్.. సడెన్ గా ప్రధానిని ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ రాజధాని మార్పు వార్తలపై పవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు మీద కోపంతో రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కులం మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద చూపొద్దని అన్నారు. 151 సీట్లు ఉన్నాయని ధీమాగా ఉండకండి అన్నారు. అధికారం ఎప్పుడూ ఒకరి పక్షాన ఉండదన్నారు. వైసీపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. ప్రధాని మోడీ అనుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, వైసీపీ ఓడిపోవచ్చు అని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలం కలిసొచ్చో లేక ఈవీఎంల ఘనతో తెలియదు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిందని పవన్ అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని మంత్రి బొత్స వ్యతిరేకిస్తే.. మోడీ, అమిత్ షా లని వ్యతిరేకించినట్టే అని పవన్ స్పష్టం చేశారు. వోక్స్ వ్యాగన్ కేసులను బొత్స గుర్తుంచుకోవాలన్నారు పవన్ కల్యాణ్.

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని జరుగుతున్న ప్రచారంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని భరోసా ఇచ్చారాయన. రైతులెవరూ తమ ప్లాట్లను అమ్ముకోవద్దన్నారు. కౌలు కోసం భూములు ఇవ్వలేదని.. భావి తరాల కోసం రైతులు భూములు ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా మాట్లాడొద్దన్నారు. రైతుల కన్నీళ్లకు కారణమైతే పాతాళానికి పడిపోతారని హెచ్చరించారు. రైతుల ఆందోళన చూసే రాజధాని ప్రాంతంలో రెండు రోజులు పర్యటించానని పవన్ తెలిపారు. రైతులకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజధాని కోసం సమిష్టిగా పోరాడదామని.. అందుకు అందరూ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు.