లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత.. మీ 151 మంది ఎమ్మెల్యేల బతుకెంత అంటూ పవన్ చెలరేగిపోయారు. 200 ఏళ్లు పాలించి తమకు తిరుగులేదని భావించిన బ్రిటిషర్లకే దిక్కు లేకుండా పోయిందన్న పవన్.. అలాంటిది వైసీపీ ఎంత.. 151 మంది ఎమ్మెల్యేలు ఎంత అని కామెంట్ చేశారు. ప్రజలు లేస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వానికి చెబుతున్నాము.. సింహాసనం ఖాళీ చేయండి.. అని వార్నింగ్ ఇచ్చారు పవన్.
విశాఖ జిల్లా గాజువాకలో జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ సమావేశం అయ్యారు. వారితో మాట్లాడిన పవన్.. సామాన్యుడి కోసమే పార్టీని పెట్టానన్నారు. మన బలమే మన బలహీనత కాకూడదన్నారు. మార్పు అనేదే జనసేన అంతిమ లక్ష్యం అని స్పష్టం చేశారు. గాజువాకలో పోటీ ఓటమిలా తనకు అనిపించడం లేదన్నారు. తనకు ప్రయాణమే తెలుసని.. పనిని సక్రమంగా నిర్వహించడమే ముఖ్యమన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానన్నారు. పోరాటయాత్రకు వచ్చిన యువత మొత్తం ఓట్లేసి ఉంటే జనసేనకు 70 సీట్లు వచ్చేవని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడితే జనసేన వెనకడుగు వేయదన్న పవన్.. ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్నారు. బాహాబాహీ తేల్చుకుందామంటే నేను రెడీ అన్నారు. ప్రతి ఎమ్మెల్యే చిట్టాను బయటకు తీయాలని జనసైనికులతో చెప్పారు.
పార్టీలను నడుపుతున్న వారిలో.. అంచెలంచెలుగా ఎదిగిన వారు కొందరైతే.. సీఎం కొడుకుగా ఉన్నవారు కొందరని సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్ కామెంట్స్ చేశారు. సమాజ హితాన్ని కోరుకునే వ్యక్తుల సమూహం వచ్చే వరకు జనసేన ఎదుగుదల మెల్లగానే ఉంటుందన్నారు. రాజకీయ నేతలంతా వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు.. తాను సినిమాలు చేస్తే తప్పేంటన్నారు. తనను విమర్శించే నాయకులు చేసే వ్యాపారాలను బయటపెట్టాలని జనసైనికులకు సూచించారు పవన్.
లాంగ్ మార్చ్ లో పాల్గొన్న జనసేన నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని పవన్ ఆరోపించారు. అదే సమయంలో జగన్ పై కత్తితో దాడి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసుల గురించి పవన్ ప్రస్తావించారు. ఆ రెండు కేసుల్లో విచారణ ఎందుకు ముందుకు వెళ్లడం లేదని పవన్ ప్రశ్నించారు. అంటే అక్కడ ఏదో మతలబు ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం చేసిన జనసైనికులపై కేసులు పెట్టిన విషయాన్ని మేము మర్చిపోము అని పవన్ అన్నారు. వెంటనే జనసేన నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే భవిష్యత్తులో గట్టి ఎదురుదెబ్బలు తప్పవు అని హెచ్చరించారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలించకపోతే, కేసులు విత్ డ్రా చేసుకోకపోతే చుక్కలు చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చారు పవన్.