మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది.
రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు మందడం వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబును తీసుకెళ్లి వాహనాన్ని దారి మళ్లించారు. కరకట్టు వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు మళ్లించారు. కృష్ణాయపాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. మంగళిరి పీఎస్ కు తరలించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతు ఏపీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపేయాలనే ఘోరమైన తప్పిదానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. జగన్ వయస్సులో చిన్నవాడైనా దండం పెట్టి అడిగా..అయినా కనికరం చూపించలేదని..ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, లాఠీచార్జీలు హేయమైన చర్యని అన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే మరింతగా రెచ్చిపోతామని హెచ్చరించారు.