ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
నిజామాబాద్ : తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో వాయిదా పడ్డ వార్డులకు కూడా నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జనవరి 25న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ కొనసాగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఈసీ పరిశీలిస్తోంది.
రాష్ట్రంలో రెండో విడతలో 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో 788 గ్రామాలు ఏకగ్రీవం కానున్నాయి. ఐదు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం ఉప సర్పంచి ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.