ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్…హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు స్పీకర్

రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
స్పీకర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…. తాను రెబల్ ఎమ్మెల్యేలకు కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసినట్లు స్పీకర్ తెలిపారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసులు పంపే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయమని మా న్యాయవాదిని కోరాను. స్పీకర్ బాధ్యతలు సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించాయి. స్పీకర్‌గా నాకు ఓ దరఖాస్తు వచ్చింది. దానిపై సమాచారం తెలుసుకోవాలనుకునే షోకాజ్ నోటీసులు జారీ చేశాను. ఉన్న అధికారంతో నోటీసులు ఇవ్వకపోతే.. ఇకా ఆ అధికారం ఎందుకు?నోటీసులు ఇవ్వటం అనేది స్పీకర్ బాధ్యత అని.. తీర్పుపై ఆధారపడాల్సింన అవసరం లేదన్నారు స్పీకర్ జోషి.
ఫిరాయింపుల నిరోధక చట్టం అనుసరించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మారుస్తూ 1992 నుంచి ఏ కోర్టు తీర్పు వెలువరించలేదని స్పీకర్ గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవుల అధికారాలు స్పష్టంగా నిర్వచించారని.. ఎన్నికైన వారు ఆ పదవిని చేపడతారని పేర్కొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేలపై గత వారమే స్పీకర్ అనర్హత వేటును ప్రకటించారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పీకర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే సచిన్ బృందం.. హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన కోర్టు.. సచిన్ టీమ్‌కు శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. దీంతో షోకాజ్ నోటీసులపై స్పందన ఆలస్యం అవుతున్నదని స్పీకర్ జోషి ఆరోపిస్తున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో కపిల్ సిబల్ స్పీకర్ న్యాయవాదిగా, పైలట్ టీమ్ కు ముకుల్ రోహత్గి ప్రాతినిధ్యం వహిస్తారు.