చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్లలో జరిగిన దాడి, అనంతర పరిణామాలను చంద్రబాబుకు వివరించారు కోడెల. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. కోడెల దాడి చేయబోతే.. తాము బంధించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కోడెలపై దాడి అంశం ఢిల్లీ వరకు వెళ్లింది. వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. జగన్.. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశం రెండు పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వైసీపీ నిజనిర్ధారణ కమిటీ వేసి సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కోడెల శివప్రసాద్ దే తప్పనే విధంగా వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఏప్రిల్ 16న గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో దాడికి సంబంధించిన వివరాలను కోడెల వెల్లడించారు. ఇనుమెట్లలో రిగ్గింగ్ జరుగుతుండగా అక్కడికి వెళ్లానని.. తనను గదిలో బందించి దాడి చేశారని వివరించారు. అప్రజాస్వామ్య విధానంలో దాడికి పాల్పడిన విషయాన్ని చంద్రబాబుకు వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం ఎన్నడూ చూడలేదని అంటున్నారు కోడెల. పల్నాడులో వైసీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారని వెల్లడించారాయన.
టీడీపీ ఓటింగ్ ను తగ్గించేందుకు చేసిన కుట్రలో భాగంగా ఇదంతా చేశారని కోడెల చెప్పారు. పల్నాడు, గురజాల, సత్తెనపల్లి, మాచర్లతోపాటు అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ నేతలు దాడులు చేశారని.. అనేక మందికి గాయాలయ్యాయని తెలిపారు. వేలాది మందిని ఓటు వినియోగించుకోకుండా చేశారని మండిపడ్డారు. ఈసీ వైసీపీ చెప్పుచేతుల్లో ఉందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ కే రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ అనధికారికంగా వ్యవహిస్తోందన్నారు. స్పీకర్ పై దాడి జరిగితే ఈసీ స్పందించలేదన్నారు.