ఏపీ రాజకీయాలపై బీజేపీ నేత సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ సహా ప్రధాన పార్టీలు బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నాయని చెప్పారు. వైసీపీ
ఏపీ రాజకీయాలపై బీజేపీ నేత సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ సహా ప్రధాన పార్టీలు బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నాయని చెప్పారు. వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ముఖ్య నేతలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నారని వెల్లడించారు.
మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి పలు అంశాలపై స్పందించారు. జగన్ ప్రభుత్వం విధానాలపై విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదన్న సుజనా.. ఇంగ్లీష్ చెప్పగలిగిన టీచర్లు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వసతులు కల్పించిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు తెలుగు మీడియంలో పాఠాలు చెబుతున్న టీచర్లు ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు చెప్పగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం ప్రకటించే ముందు ఎవరినైనా సంప్రదించారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 6వేల 400 హైస్కూళ్లు ఉంటే 32 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చేరుతున్నారని చెప్పారు. సగానికిపైగా హైస్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఉన్నా పిల్లలు చేరేందుకు ఆసక్తిగా లేరని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. హడావుడిగా వితండవాదంతో ఇంగ్లీష్ మీడియం పెడితే విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని, భవిష్యత్ తరాలు నష్టపోతాయని హెచ్చరించారు.
రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని(వెంకయ్య నాయుడు) కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తెలుగు భాషను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంటే మాతృభాషను కాపాడాలని కేంద్రం చూస్తోందని వివరించారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో జగన్ ప్రభుత్వం విద్యావేత్తలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. జెరూసలెం యాత్రికులకు ఆర్దిక సాయం పెంచిన ప్రభుత్వం అమర్నాధ్ యాత్రకు ఎందుకు ఇవ్వలేదంటే ఏం సమాధానం చెబుతుందని సుజనా చౌదరి ప్రశ్నించారు. ఏపీలో జగన్ పాలనలో 6 నెలల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని.. రివర్స్ పాలన జరుగుతోందని విమర్శించారు. రోజుకో సంక్షేమ పథకం ప్రకటిస్తున్న ప్రభుత్వం.. నిధులు ఎలా తెస్తుందని అడిగారు. ఆస్తులను అమ్ముకుంటూ పోతే కొండైనా కరిగిపోతుందన్నారు. ఆస్తులు, భూములు అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు.
జెరూసలెం యాత్రకు నిధులిచ్చిన ప్రభుత్వం.. మరి అమర్నాథ్ యాత్రకు ఎందుకివ్వలేదు అంటే ఏం సమాధానం చెబుతారని సుజనా చౌదరి ప్రశ్నించారు. జెరూసలెం, మక్కా వెళ్లేందుకు రాయితీలు ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు వినియోగించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. రేపు హిందూ దేవాలయాలకు వెళ్లేందుకు నిధులు అడిగితే ఇస్తారా అని ప్రశ్నించారు. టీటీడీ చట్టాలను ఉల్లంఘించి.. ఆ నిధులను ఇతర పనులకు వినియోగించే ప్రయత్నం కరెక్ట్ కాదన్నారు.