న్యాయవాదులు 3 పెళ్లిళ్లు చేసుకోవాలి : టీడీపే నేత బీకే పార్ధసారథి

ఏపీని మూడు రాజధానులుగా చేస్తానని సీఎంజగన్ చెప్పినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా ఈ అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు.
డిసెంబర్ 23 సోమవారం ఆయన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కర్నూలు హైకోర్టు, విజయవాడ, విశాఖ హైకోర్టు బెంచీల్లో న్యాయవాదులు పని చేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కర్నూలులో హైకోర్టు కాదు రాజధాని నిర్మించాలని పార్ధసారధి డిమాండ్ చేశారు. కాగా, బీకే వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వెలిబుచ్చారు. తమను అవమానించేలా బీకే వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన వెంటనే తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.