టీడీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 08:19 AM IST
టీడీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

Updated On : March 5, 2019 / 8:19 AM IST

చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని వెళ్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని వ్యూహాలకు పదును పెడుతుంటాయి. ఈసారి కూడా పరస్పరం కొందరు నేతల్ని టార్గెట్‌ పెట్టడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి.

వర్గ రాజకీయాలకు, ప్రతీకార పోరుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో ఇదే తరహా రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రతీకార రాజకీయాలకు నేతలు పదును పెడుతున్నారు. అవతల పార్టీలోని ఇద్దరు, ముగ్గుర్ని టార్గెట్ చేసి వారిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఎవరికి వారు వ్యూహలు రచిస్తున్నారు. ఈ టార్గెట్‌ పాలిటిక్స్‌ వెనక ఎవరి కారణాలు వారికున్నాయి.
Also Read : అటో ఇటో ఎటో : పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ

టీడీపీ టార్గెట్ లిస్ట్‌లో తొలి పేరు వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ రోజానే. నగరి ఎమ్మెల్యే రోజాతో టీడీపీకి మొదటి నుంచి సమస్యే. 2014 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు రోజా. నాటి నుంచి ఆమె తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీలున్నప్పుడల్లా టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు.

నాలుగున్నరేళ్ల కాలంలో రోజా వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా టీడీపీ నేతలపై ఆమె నోరు పారేసుకుంటుండడం ఆ పార్టీ నేతల్ని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. అసెంబ్లీలోనూ రోజా వ్యవహార శైలి పట్ల అధికార పార్టీ మొదట్నుంచీ గుర్రుగానే ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలపై సభ నుండి సస్పెండ్‌ చేసినా తీరు మారలేదు. సామాన్య కార్యకర్త మొదలు పార్టీ అధినేత చంద్రబాబు వరకు ఎవరినీ వదలకుండా నోటికి పని చెబుతుండడంపై తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీకి రోజా కొరగానికొయ్యలా మారారు.

ఇదే సమయంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం.. ఆ వెంటనే గాలి కుటుంబంలో విభేదాలు వంటి అంశాలు రోజాకు రాజకీయంగా కలిసి వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో ఆమెను ఎదుర్కొనే తమ్ముళ్లు కరువైపోయారు. ఈ కారణాలతో తెలుగుదేశానికి రోజా టార్గెట్ నంబర్ వన్‌గా మారారు. ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలని టీడీపీ కృత నిశ్చయంతో ఉంది. ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని లక్ష్యంగా నిర్ణయించుకుంది. రోజాను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థి కోసం అధినేత చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2,3 రోజుల్లోనే ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ అభ్యర్థి ఎవరు, ఏ విధంగా రోజాకు టీడీపీ చెక్ పెడుతుంది.. అన్నది చూడాలి.
Also Read : వైసీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

ఇక టార్గెట్‌ నెంబర్‌ 2 చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. సీనియర్ పొలిటీషియన్‌. గల్లా అరుణపై స్వల్ప మెజారిటీతో గెలిచి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. ఈయనది మొదట్నుంచీ కూడా దూకుడు స్వభావమే. ఎమ్మెల్యే అయ్యాక మరింత జోరు పెంచారు. ఓటమి తర్వాత మనస్తాపంతో గల్లా అరుణ నియోజకవర్గానికి దూరం కావడం చెవిరెడ్డికి రాజకీయంగా కలిసొచ్చింది. నియోజకవర్గంలో టీడీపీ కేడర్‌ను తొక్కేయడమే కాకుండా అధికారులను సైతం బెదిరించి పనులు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉండటంతో  స్వయంగా చంద్రబాబు తనను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ప్రచారం చేసి అందరి దృష్టిలో పడ్డారు చెవిరెడ్డి. నేరుగా చంద్రబాబుపైనే మాటల దాడి చేస్తుంటారు. తరచూ పోలీసులతో గొడవలు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం పొందుతుంటారు. దీంతో జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీకి టార్గెట్ నెంబర్‌-2 గా మారారు.

ఇక టీడీపీ టార్గెట్ నెంబర్‌ త్రీ.. మోస్ట్‌ సీనియర్‌ పొలిటీషియన్‌, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడు. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను పెద్దిరెడ్డి శాసిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు మొదలు అభ్యర్థుల ఎంపిక వరకు అంతా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో.. అవసరమైన సమయంలో వైసీపీ నేతలను ఆర్థికంగా ఆదుకుంటున్నది కూడా పెద్దిరెడ్డే. రాజకీయ వ్యూహ రచనలో ఈయన దిట్ట. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీకి దక్కడం వెనక పెద్దిరెడ్డి పాత్ర ఎంతో ఉంది. ఈ కారణాలతోనే టీడీపీ చాలా కాలంగా పెద్దిరెడ్డిని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే ఈ దఫా ఆయనకు ప్రత్యర్థిగా మంత్రి అమర్నాథరెడ్డి మరదలు అనూషా రెడ్డిని ఎంపిక చేశారు. పెద్దిరెడ్డిని కట్టడి చేసి జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టాలన్నది టీడీపీ వ్యూహం. ఒక దశలో పెద్దిరెడ్డిని టీడీపీలోకి లాక్కోవాలనే ప్రయత్నాలూ జరిగి చివరకు విఫలమయ్యాయి. రాజకీయంగా పెద్దిరెడ్డిని అణగదొక్కడానికి టీడీపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది.