రైతుకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండంలోని ఓ రైతు సమస్యపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాలు తెలుసుకుని వెంటనే రైతుకు ఫోన్ చేసి అతనికి భరోసా ఇచ్చారు. నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే రైతు తన భూమి విషయంలో జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో తీసి అన్ని వివరాలతో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నందులపల్లి వీఆర్వో కరుణాకర్ చేస్తున్న అవినీతిపై స్వయంగా ముఖ్యమంత్రే స్పందించేలా చేశాడు.
రైతు శరత్ కుటుంబం నందులపల్లి గ్రామ శివారులోని 7 ఎకరాల కుంట భూమిని గత 55 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. దానికి సంబంధించని ఆధారాలు కూడా వారి వద్ద ఉన్నాయి. వీఆర్వో కరుణాకర్ రైతు అనుమతి లేకుండా ఆభూమిని వేరే వారి పేరు మీదకు బదలాయించాడు. జరిగిన నష్టాన్ని గుర్తించిన రైతు వీఆర్వో, ఎమ్మార్వో, కలెక్టర్ ల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరాడు. దాదాపు 11 నెలలుగా వీరి చుట్టూ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రైతు శరత్ తన గోడును సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీన్ని సీఎం కేసీఆర్ కు చేరేలా అందరూ షేర్ చేయాలని అందులో కోరాడు.
రైతు కోరుకున్నట్టుగానే సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పోస్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ స్వయంగా రైతుతో ఫోన్‌లో మాట్లాడి వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నందులపల్లి గ్రామంలో పర్యటించి రైతుకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.