త్వరలో ముగియనున్న స్వామిగౌడ్ పదవీకాలం
ఈసారి స్వామిగౌడ్ పోటీ చేయకపోవచ్చని ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన స్వామిగౌడ్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం
చంద్రశేఖర్ గౌడ్‌కు అందరి అండదండలు
మాజీ జర్నలిస్ట్ సత్యనారాయణ ఆసక్తి
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాసనమండలి ఎన్నికలపై చాలా మంది పెద్దలు ఆశలు పెంచుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. దీంతో పెద్దల సభకు వెళ్లేందుకు చాలా మంది టీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత ద్వారా పార్టీ అధినేత కేసీఆర్‌కు తమ పేరు సిఫారసు చేయించుకునే పనిలో ఉన్నారు.
ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత మండలి ఎలక్షన్ల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ పట్టభద్రుల స్థానం అభ్యర్థిత్వం కోసం టీఆర్‌ఎస్ నాయకుల్లో పోటీ పెరుగుతోంది.
ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మండలి చైర్మన్‌గా ఉన్న స్వామిగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వామిగౌడ్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. స్వామిగౌడ్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ప్రచారం జరిగింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా.. అది సాధ్యంకాలేదు. దీంతో స్వామిగౌడ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తోపాటు టీఎన్‌జీవోల సంఘం, టీఆర్‌ఎస్ అధిష్టానం మద్దతు కూడా చంద్రశేఖర్‌గౌడ్‌కు ఉందని వినిపిస్తోంది. మరోవైపు సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ కూడా ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. సత్యనారాయణ 2007లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు కలిసి ఉన్న ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారు. కేసీఆర్ పిలుపుతో ఏడాదిలోపే ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేసి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్న సత్యనారాయణ.. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సత్యనారాయణను కేటీఆర్, హరీశ్‌రావు బుజ్జగించారు. సత్యనారాయణ రాజీనామాతో 2008లో ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో నారదాసు లక్ష్మణ్‌రావు గెలుపొందితే, 2013లో ప్రస్తుత మండలి చైర్మన్ ఈ స్థానం నుంచి నెగ్గారు. ఈ ముగ్గురూ బీసీలు కావడంతో ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణలకు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గంపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల సంఘం కార్యదర్శి యాదగిరిరావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, టీఎన్జీవోల సంఘం మాజీ నాయకుడు షామీద్, పేర్యాల దేవేందర్‌రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ నాయకత్వం వీరిలో ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి మరి.