అప్పుడే రెచ్చిపోతే ఎలా : జగన్‌ సభలో పోలీసులపై దాడి

  • Publish Date - April 4, 2019 / 04:42 AM IST

కృష్ణా జిల్లా మైలవరం జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. మొదట లాఠీచార్జీ చేసిన పోలీసులు.. చివరికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో దూరంగా వెళ్లిపోయారు. అయినా వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు.

మైలవరంలో ఏప్రిల్ 3 బుధవారం జగన్‌ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల ప్రచార సభలో జగన్‌ టీడీపీ, మీడియా, పోలీసులను దూషిస్తూ ప్రసంగం కొనసాగింది. జగన్‌ ప్రసంగం ముగించిన వెంటనే కార్యకర్తలు రెచ్చిపోయారు. బందోబస్తులో ఉన్న ప్రత్యేక పోలీసు బలగాలపైకి చెప్పులు విసరడం మొదలు పెట్టారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఒకరిద్దరిపై స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడుతూ బీభత్సం సృష్టించారు. ఈ దశలో పోలీసులు కిలోమీటర్‌ వరకు పరుగు తీశారు. వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నా సైలెంట్‌ అయిపోయారు. 

వైసీపీ కార్యకర్తలు వెంటపడి మరీ పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో 10 నిమిషాలు ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అసలే ఇరుకైన ప్రదేశం కావడంతో ఏం జరుగుతోందో తెలియక సభకు వచ్చిన జనం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు లాఠీచార్జీలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ సభకు హాజరైన స్థానికులను  పోలీసులు ఈడ్చుకెళ్లారని ఆరోపించారు.