అమరావతి: టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సంచలనం సృష్టించారు. 2019 మార్చిలో పొత్తులపై చర్చలు ఉంటాయన్నారు. మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేష్.. జనసేన-టీడీపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నారు.
సీఎం కుర్చీపై ఆశలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో చెప్పారని టీజీ వెంకటేశ్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయడమే లక్ష్యమన్నారని.. కాబట్టి రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ కలిసి పోటీ చేసిన విషయాన్ని టీజీ గుర్తు చేశారు. గతంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉండేవని.. కాని బీజేపీని ఓడించేందుకు కలిసి పోటీ చేయలేదా అన్నారు. జనసేన-టీడీపీ మధ్య పొత్తుపై కార్యకర్తలుగా ఉన్న తాము తేల్చలేమని.. అధినేతలు చర్చిస్తారన్నారు.
జనసేన-టీడీపీ పొత్తుపై టీజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోమని.. వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. టీజీ ఏమో పొత్తుల గురించి ప్రస్తావించారు. టీజీ కామెంట్స్‌పై జనసేన పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.